
North Telangana : హైదరాబాద్ మహానగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు, అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు భారీ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనులు ఎట్టకేలకు పట్టాలెక్కాయి. ప్రస్తుతం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికులు నగర శివార్లకు చేరుకోవడం కంటే, అక్కడి నుంచి నగరంలోని ప్రధాన ప్రాంతాలకు వెళ్లడానికే తీవ్రంగా నరకయాతన అనుభవిస్తున్నారు. పీక్ అవర్స్‌లో కేవలం ఐదారు కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి గంట నుంచి గంటన్నర పైనే సమయం పడుతుండటంతో శామీర్‌పేట, హకీంపేట మీదుగా సికింద్రాబాద్ వైపు వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు కొత్త కారిడార్ల నిర్మాణం పూర్తి అయితే ఈ ట్రాఫిక్ జామూ, కష్టాలూ పూర్తిగా తీరనున్నాయి.
ఇటీవల ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభం కావడంతో హెచ్ఎండీఏ (HMDA) కమిషనర్ సర్ఫరాజ్ ఆదేశాల మేరకు అధికారుల బృందం శనివారం మీడియాతో కలిసి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించింది. పనులను పర్యవేక్షిస్తున్న ఆయా నిర్మాణ ఏజెన్సీల ప్రతినిధులతో ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి, నిర్దేశించిన కాలపరిమితిలోనే నాణ్యతతో పనులను పూర్తి చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు కారిడార్లు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం పడుతున్న 45-60 నిమిషాల ప్రయాణ సమయం కేవలం 10-15 నిమిషాలకు తగ్గిపోనుంది. ఈ భారీ ప్రాజెక్టుల వల్ల శామీర్‌పేట పరిసర ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందడమే కాకుండా సికింద్రాబాద్, కంటోన్మెంట్, శామీర్‌పేట ప్రాంతాల ఆర్థిక స్వరూపాన్ని మార్చేసే ‘గేమ్ ఛేంజర్లు’గా ఇవి నిలుస్తాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్యారడైజ్ జంక్షన్ నుంచి బాలంరాయ్ జంక్షన్, రాజీవ్‌గాంధీ విగ్రహం జంక్షన్, బేగంపేట రన్‌వే ఏరియా, బోయినపల్లి చెక్‌పోస్టు మీదుగా డెయిరీఫాం వరకు మొత్తం 5.3 కిలోమీటర్ల మేర మొదటి కారిడార్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో 4.6 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ (ఫ్లైఓవర్) రానుండగా, బేగంపేట ఎయిర్‌పోర్టు రన్‌వే నుంచి విమానాల రాకపోకలకు ఎలాంటి సాంకేతిక లేదా రక్షణ పరమైన ఆటంకాలు కలగకుండా ఉండేందుకు వీలుగా 600 మీటర్ల పొడవైన అత్యాధునిక భూగర్భ సొరంగ మార్గాన్ని (అండర్ టన్నెల్) ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కారిడార్‌కు సంబంధించిన పిల్లర్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది.
Also Read : అల్లం పేస్ట్ నుండి చికెన్ దాకా అన్నీ కల్తీనే.. 100 రోజుల్లో 121 టన్నుల నకిలీ ఫుడ్ సీజ్!
ఈ మొదటి కారిడార్ పరిధిలో ఇప్పటికే 20 పిల్లర్లు, 6 వయోడక్ట్‌ల పనులను అధికారులు విజయవంతంగా ప్రారంభించారు. బేగంపేట ఎయిర్‌పోర్టు రన్‌వే సమీపంలో అండర్ టన్నెల్ పనులను త్వరితగతిన చేపట్టేందుకు బాలంరాయ్ జంక్షన్ వద్ద అవసరమైన అన్ని భారీ ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. రాబోయే రెండేళ్ల కాలంలోనే ఈ పనులన్నింటినీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కీలకమైన కారిడార్ కోసం ప్రభుత్వం భూసేకరణ వ్యయంతో కలుపుకుని మొత్తం రూ.1,487 కోట్ల భారీ బడ్జెట్‌ను వెచ్చిస్తోంది.
మరోవైపు, ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట వరకు చేపట్టనున్న 18.14 కిలోమీటర్ల పొడవైన రెండో ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించిన పనులు కూడా త్వరలోనే ఊపందుకోనున్నాయి. ఈ భారీ కారిడార్‌ను తిరుమలగిరి, అల్వాల్, హకీంపేట మీదుగా శామీర్‌పేట వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు (ORR) నేరుగా అనుసంధానించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా టివోలీ జంక్షన్, జనరల్ చౌదరి రోడ్డు, సికింద్రాబాద్ క్లబ్ జంక్షన్ నుంచి విక్రంపురి వరకు కొనసాగేలా 1.3 కిలోమీటర్ల మేర ఒక ఓపెన్ అండర్‌పాస్‌ను నిర్మించనున్నారు. వాహనాల సులువైన రాకపోకల కోసం ఈ అండర్‌పాస్‌కు ఇరువైపులా రెండు లేన్ల చొప్పున సర్వీసు రోడ్లను కూడా అభివృద్ధి చేయనున్నారు.
ఈ ఓపెన్ అండర్‌పాస్ ముగిసిన వెంటనే అక్కడ నుంచి మళ్లీ భారీ ఫ్లైఓవర్ (ఎలివేటెడ్ కారిడార్) ప్రారంభమవుతుంది. అలాగే హకీంపేట ఎయిర్‌పోర్టు వైమానిక రక్షణ నిబంధనల ప్రకారం అక్కడ 400 మీటర్ల మేర అండర్ టన్నెల్‌ను, తూంకుంట పరిసర ప్రాంతాల్లో స్థానిక వాహనదారుల సౌకర్యార్థం వెహిక్యులర్ అండర్‌పాస్‌ను (VUP) నిర్మిస్తున్నారు. రూ.4,263 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ రెండో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కూడా రాబోయే రెండేళ్లలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read : నిర్మాత బండ్ల గణేశ్‌కు బిగ్ షాక్..ఆస్తి వేలాన్ని సమర్థించిన హై కోర్టు









