
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు అవుతున్న ‘చేయూత’ పింఛన్ల పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతను పెంచడంతో పాటు ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం సరికొత్త సాంకేతికతతో క్షేత్రస్థాయి పరిశీలనను ప్రారంభించింది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున జరుగుతున్న పింఛన్ల అక్రమాలను తాజాగా ప్రభుత్వం బట్టబయలు చేసింది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 42 లక్షల మంది చేయూత పింఛనుదారులు ఉన్నారు. వీరిలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు లాంటి వివిధ కేటగిరీల వారు లబ్ధి పొందుతున్నారు. ఈ మొత్తం లబ్ధిదారులలో దాదాపు 19 లక్షల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి ప్రతి నెలా కోర్ బ్యాంకింగ్ విధానం (సీబీఎస్) ద్వారా నేరుగా నగదు జమ అవుతోంది.
గతంలో దారిద్య్ర నిర్మూలనా సంస్థ (సెర్ప్) నిర్వహించిన పైలట్ పరిశీలనలో పింఛన్ల పంపిణీలో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు ప్రాథమికంగా ఆధారాలు లభించాయి. దీనితో అలర్ట్ అయిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు అసలు బతికే ఉన్నారా లేదా అని నిర్ధారించేందుకు ‘లైవ్ అథెంటికేషన్’ (జీవించి ఉన్నట్లు ధ్రువీకరణ) ప్రక్రియను విస్తృతంగా చేపట్టింది. సాంకేతికత ఆధారంగా బయోమెట్రిక్, ఐరిస్ విధానంలో సాగుతున్న ఈ ప్రక్రియలో అధికారులకు దిమ్మతిరిగే నిజాలు వెలుగుచూశాయి.
తాజాగా జరిపిన ఈ వెరిఫికేషన్‌లో అక్రమంగా పింఛన్లు పొందుతున్న వారి సంఖ్య దాదాపు లక్షకు చేరువ కావడంతో అధికార యంత్రాంగం విస్మయానికి గురైంది. లబ్ధిదారుల జాబితాను నిశితంగా పరిశీలించే కొద్దీ అనర్హులకు చేయూత పింఛన్లు అందుతున్న వైనం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో తక్షణమే స్పందించిన ప్రభుత్వం చనిపోయిన, అర్హత లేని వారి పేర్లను పింఛన్ల జాబితా నుంచి శాశ్వతంగా తొలగించాలని నిర్ణయించింది.
ఈ లైవ్ అథెంటికేషన్ ప్రక్రియలో అత్యంత ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏండ్ల కిందటే మరణించిన దాదాపు 63,532 మంది పేరిట ఇప్పటికీ అక్రమార్కులు ఆశతో ప్రతి నెలా పింఛను సొమ్మును డ్రా చేస్తున్నట్లు నిఘా వర్గాలు, క్షేత్రస్థాయి పరిశీలనలో నిర్ధారణ అయింది. చనిపోయిన వారి పేర్ల మీద కూడా నెలనెలా డబ్బులు డ్రా అవుతుండటం పింఛన్ల పంపిణీలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతోంది.
మరోవైపు, పింఛన్లు అందుకుంటున్న వారిలో దాదాపు 27,158 మంది లబ్ధిదారులు ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియని ఆందోళనకర పరిస్థితి నెలకొంది. వారి రికార్డుల్లో నమోదైన మొబైల్ నంబర్లకు అధికారులు పలుమార్లు సంప్రదించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. దీంతో వారు వాస్తవంగా బతికే ఉన్నారా? లేక వారి వివరాలను వాడుకుని ఎవరైనా అక్రమంగా పింఛన్లు పొందుతున్నారా? అనే అంశంపై అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు.
Also Read : కవితకు ఈసీ బిగ్‌షాక్..TRSపేరు ఔట్ ?
ఈ ధ్రువీకరణ ప్రక్రియలో సుమారు 5,000 మంది లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్రం వెలుపల నివసిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వీరిలో పలువురు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను కూడా ఏకకాలంలో పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీటితో పాటు సుమారు 700 మంది లబ్ధిదారులు లైవ్ అథెంటిఫికేషన్‌కు అస్సలు సహకరించకుండా, పింఛన్ కొనసాగింపుపై ఎలాంటి ఆసక్తి చూపడం లేదు.
అయితే అందరూ అక్రమార్కులే కాకుండా, కొందరు నిజమైన లబ్ధిదారులు సాంకేతిక కారణాల వల్ల ధ్రువీకరణ ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 12,000 మంది లబ్ధిదారుల ఆధార్ వివరాల్లో తప్పులు, తేడాలు ఉండటంతో వారి ధ్రువీకరణ నిలిచిపోయింది. మరో 33,000 మందికి వృద్ధాప్యం కారణంగా వేలిముద్రలు సరిపోలకపోవడం (బయోమెట్రిక్), ఐరిస్ స్కాన్ నమోదు కాకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. వీరికి ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా ధ్రువీకరణ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
ఈ ప్రక్షాళన ప్రక్రియలో ఉత్తర తెలంగాణ పరిధిలోని కొన్ని జిల్లాలు వంద శాతం పురోగతి సాధించి ముందంజలో నిలిచాయి. కరీంనగర్ జిల్లా ఏకంగా 1,19,458 మంది లబ్ధిదారుల వెరిఫికేషన్‌ను పూర్తి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మంచిర్యాల జిల్లాలో 22,641 మంది, ములుగు జిల్లాలో 7,900 మంది వివరాలను వెరిఫై చేసి వంద శాతం ప్రక్రియను ముగించారు. అలాగే నల్గొండ జిల్లాలో 99.93 శాతం, యాదాద్రి-భువనగిరి జిల్లాలో 99.73 శాతం వెరిఫికేషన్ పూర్తయింది.
ఉత్తర తెలంగాణ జిల్లాలు ముందంజలో ఉంటే, రాజధాని పరిసర జిల్లాలు మాత్రం ఈ ప్రక్రియలో వెనుకబడి ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా 64.97 శాతం, మేడ్చల్-మల్కాజిగిరి 65.38 శాతం, హైదరాబాద్ జిల్లా 67.29 శాతంతో వెనుకబడ్డాయి. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే ఇంకా 82,000 మందికి పైగా లబ్ధిదారుల వివరాలు తేలాల్సి ఉంది. మొత్తం 19 లక్షల సీబీఎస్ పింఛనుదారుల్లో ఇప్పటివరకు 15.50 లక్షల మంది అథెంటికేషన్ పూర్తి కాగా, రిమార్క్స్ క్యాప్చర్ అయినవారు 1.40 లక్షల మంది ఉన్నారు, మరో రెండు లక్షల మంది ప్రక్రియ వేగవంతం కావాల్సి ఉంది.
అనర్హులను తొలగించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై పడుతున్న అనవసర భారాన్ని తగ్గించి, ఆ మిగిలే నిధులను నిజమైన నిరుపేదలకు అందించాలని ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం గుర్తించిన లక్ష మంది అనర్హుల స్థానంలో, కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులకు పింఛన్లను మంజూరు చేయనున్నారు. దీనితో పాటు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 2 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను అధికారులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయాల ద్వారా రాష్ట్రంలో కొత్తగా దాదాపు 3 లక్షల మందికి నూతనంగా పింఛన్ సౌకర్యం లభించనుంది. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ కూడా ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. ఏళ్ల తరబడి పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇది పెద్ద ఊరట కానుంది. త్వరలోనే ఈ అర్హుల తుది జాబితాను విడుదల చేసి, కొత్త పింఛన్ల పంపిణీని ప్రారంభించనున్నట్లు సచివాలయ వర్గాలు స్పష్టం చేశాయి.
Also Read : కరెంట్ బస్సుల్లో చైనా మంటలు.. అద్దె బస్సులను పక్కనబెట్టిన తెలంగాణ RTC









