
Gade Sai Krishna Missing Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం, మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మిస్సింగ్ మిస్టరీపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయంలో శనివారం మెజిస్టీరియల్ విచారణ ప్రారంభమైంది. భారతీయ న్యాయ సంహిత (BNS) చట్ట నిబంధనలకు లోబడి, జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) మార్గదర్శకాలను అనుసరిస్తూ విజయవాడ ఆర్డీవో వెన్నెల శ్రీను నేతృత్వంలో ఈ అధికారిక విచారణ ప్రక్రియ కొనసాగింది.
ఈ విచారణలో భాగంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, ఆమె సోదరి కనకదుర్గ, సోదరులు ముళ్లపూడి నాగేశ్వరరావు, నవరంగ్‌లతో కలిసి ఆర్డీవో ఎదుట హాజరయ్యారు. సుమారు రెండు గంటలకు పైగా సాగిన ఈ విచారణలో సాయికృష్ణ అదృశ్యానికి ముందు, ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఆమె సుదీర్ఘంగా వివరించారు. తన కుమారుడి అదృశ్యం వెనుక ఉన్న వాస్తవాలను, తనకు తెలిసిన కీలక సమాచారాన్ని రికార్డుల రూపంలో విచారణాధికారికి అందజేసి, తమకు న్యాయం చేయాలని కన్నీటితో వేడుకున్నారు.
విచారణాధికారి ఎదుట విజయలక్ష్మి ఇస్తూ, తన కుమారుడిని పోలీసులే స్టేషన్‌లో దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపేశారని సంచలన వాంగ్మూలం ఇచ్చారు. కృష్ణలంక సీఐ నాగరాజు తన కుమారుడి కాళ్లలో మేకులు కొట్టి, రహస్య భాగాల్లో విచక్షణారహితంగా కొట్టడం వల్లే సాయికృష్ణ ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు. పోలీసులు కొట్టిన ప్రతిసారీ సాయికృష్ణకు చికిత్స అందించిన స్థానిక ఆర్‌ఎంపీ డాక్టర్‌కు ఈ విషయాలన్నీ తెలుసని, పోలీసుల అరాచకాలకు సంబంధించిన పక్కా ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వాటిని సమర్పించడానికి రెండు రోజుల సమయం కావాలని ఆమె కోరారు.
Also Read : రూ.600 కోట్ల ఆస్తి.. మనవడి మరణాన్ని తట్టుకోలేక..కేతన్ అగర్వాల్ ఇంట మరో విషాదం…
తన కుమారుడు చనిపోయిన తర్వాత శవాన్ని తమకు అప్పగించకుండా పోలీసులు మాయం చేశారని విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్వాధీనం చేసుకున్న ఎముకలు, బూడిద తన కుమారుడివేనన్న గ్యారంటీ ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈ కేసును పక్కదారి పట్టించడానికి, తన కుమారుడిని క్రిమినల్ అని, అత్యాచారం చేశాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు పోలీసులు ఇలా ఎంతమందిని చంపి తగలబెట్టారో దర్యాప్తులో తేలాలని, నిందితుడైన సీఐ నాగరాజు నుండి ప్రస్తుతం తమ ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
తన కుమారుడిని పట్టుకోవడానికి పోలీసులు కుట్ర పన్నారని విజయలక్ష్మి ఆరోపించారు. గతంలో పోలీసులు తన మొబైల్ ఫోన్‌ను తీసుకువెళ్లి, 12 రోజుల తర్వాత ఓ కానిస్టేబుల్ ద్వారా తిరిగిచ్చారని తెలిపారు. ఈ మధ్యకాలంలో ఆ ఫోన్ ద్వారానే సాయికృష్ణ ఎక్కడున్నాడో కనిపెట్టి, అదుపులోకి తీసుకుని చంపేశారని పేర్కొన్నారు. మరోవైపు, సాయికృష్ణను లాకప్‌లో కొడుతుండగా చూశామని సబ్‌కలెక్టర్ కార్యాలయ ఏవోకి చెప్పిన ఇద్దరు గంజాయి కేసు యువకులు, శనివారం నాటి విచారణ ముగిసేవరకు వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడం వెనుక పోలీసుల బెదిరింపులు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విచారణ అనంతరం విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ అత్యంత భావోద్వేగానికి లోనయ్యారు. “నా కుమారుడు పవన్ కల్యాణ్ అభిమాని, ఆయనకే ఓటేసి గెలిపించాం. నా కొడుకు బూడిదనైనా నాకు ఇప్పించండి, కర్మకాండలు చేసుకుంటా. లేనిపక్షంలో నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంటా” అని ప్రభుత్వానికి, అధికారులకు కన్నీటితో హెచ్చరిక జారీ చేశారు. తన కొడుకు తప్పు చేశాడని భావిస్తే, స్వయంగా పవన్ కల్యాణే విచారించి నిరూపించాలని డిమాండ్ చేశారు.
ఈ విచారణకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) ముఖ్య నేతలు అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్‌బాబు తదితరులు హాజరై, బాధితురాలికి మద్దతు ప్రకటించారు. అనంతరం ఆర్డీవోకు ఒక వినతిపత్రం సమర్పించారు. మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు.. బాధితుడి ఒంటిపై కేవలం దెబ్బలు తగిలితేనే మెజిస్టీరియల్ విచారణ సరిపోతుందని, కానీ ఇక్కడ ప్రాణమే పోయినందున తక్షణమే ‘జ్యుడీషియల్ విచారణ’ జరపాలని డిమాండ్ చేశారు. ఈ లాకప్ డెత్ మిస్టరీని ఛేదించడానికి కేసును సీబీఐ (CBI) కి అప్పగించాలని, బాధ్యులైన పోలీసులకు ఉరిశిక్ష పడేవరకు పోరాడతామని స్పష్టం చేశారు.
ఈ ఘోర ఉదంతంపై మానవ హక్కుల ఫోరం (HRF) తీవ్రంగా స్పందించింది. ఫోరం తరఫున హాజరైన పలువురు న్యాయవాదులు విచారణ ప్రక్రియను పరిశీలించారు. ఆర్డీవోతో మాట్లాడుతూ.. ఇంత పెద్ద లాకప్ డెత్ ఆరోపణలు ఉన్న కేసులో కేవలం మెజిస్టీరియల్ విచారణతోనే సరిపెట్టడం ఏంటని, జ్యుడీషియల్ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. చట్ట ప్రకారం ఈ రెండు విచారణలు వేర్వేరని, బాధితులకు పూర్తి న్యాయం జరగాలంటే న్యాయవ్యవస్థ పర్యవేక్షణలోనే విచారణ జరగాలని వారు ఒత్తిడి తెచ్చారు.
ఈ కేసు తీవ్రత దృష్ట్యా ప్రజల వద్ద గానీ, స్థానికుల వద్ద గానీ ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి సమాచారం, సాక్ష్యాధారాలు ఉన్నా వెంటనే విచారణాధికారికి సమర్పించాలని అధికారులు ఒక ప్రకటనలో బహిరంగంగా కోరారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ప్రాథమిక వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న ఆర్డీవో వెన్నెల శ్రీను, ఆమె అడిగిన రెండు రోజుల సమయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. వారం రోజుల్లోగా ఆమెను మరిన్ని ఆధారాలతో మరోసారి విచారణకు పిలుస్తామని, పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని అధికారులు వెల్లడించారు.
Also Read : విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర..రూ.180 కోట్లతో డీల్









