Tamil Nadu Chief Minister Vijay
Tamil Nadu Chief Minister Vijay

Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా అగ్నిగుండంగా మారాయి. కోలీవుడ్ అగ్ర నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి తెర వెనుక ఒక భారీ కుట్ర జరిగిందనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా రూ.180 కోట్ల బడ్జెట్‌తో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రత్యర్థులు పక్కా స్కెచ్ వేసినట్లు ఇంటెలిజెన్స్, పోలీస్ వర్గాల దర్యాప్తులో తేలింది.

కార్పొరేట్ సంస్థ వ్యూహరచన.. గిండి హోటలే అడ్డా!
పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన నిందితులను లోతుగా విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ కుట్ర వెనుక ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ వ్యూహకర్తగా వ్యవహరించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. స్థానిక గిండి (Guindy) ప్రాంతంలోని ఒక లగ్జరీ హోటల్‌ను ఈ ఆపరేషన్‌కు ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నారు. ఆ కార్పొరేట్ సంస్థ ప్రతినిధులతో కలిసి తాము కూడా సదరు హోటల్లో వారం రోజుల పాటు బస చేసి, ఎమ్మెల్యేలను ఎలా ప్రలోభపెట్టాలనే దానిపై వ్యూహాలు సిద్ధం చేసినట్లు నిందితులు విచారణలో వెల్లడించారు.

టీవీకే ప్రభుత్వం కూల్చివేతకు సహకరిస్తే, అంటే పార్టీ ఫిరాయిస్తే రూ.35 కోట్లు ఇస్తామంటూ ఒక యూట్యూబర్ తనను నేరుగా సంప్రదించాడని టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజా ఇటీవల పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన చెన్నై పోలీసులు రంగంలోకి దిగి ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. సుమారు 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి, వారిని ప్రలోభపెట్టడం ద్వారా విజయ్ ప్రభుత్వాన్ని మైనారిటీలో పడేయాలని చూసినట్లు గుర్తించి తొలుత ముగ్గురిని, ఆ తర్వాత మరికొందరిని కలిపి మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ మొత్తం కుట్ర వ్యవహారంలో ఒక ప్రముఖ యూట్యూబర్ తిరునావుక్కరసుతో పాటు డీఎంకే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన తమ్ముడు అశోక్ కుమార్ కీలక పాత్ర పోషించారని పోలీసులు నిర్ధారించారు. వారి ఆదేశాలు, పర్యవేక్షణలోనే తాము టీవీకే ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించినట్లు పట్టుబడిన నిందితులు అంగీకరించారు. దీంతో ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ కుమార్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అలాగే ఆ వెనుక ఉన్న కార్పొరేట్ సంస్థ ఏది అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది.

మాజీ సీఎం స్టాలిన్ పదే పదే వ్యాఖ్యలు.. విజయ్ అప్రమత్తం
రాజకీయంగా తమిళనాడులో ప్రస్తుతం ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని మాజీ సీఎం స్టాలిన్ పదే పదే బహిరంగ వ్యాఖ్యలు చేయడం ఈ కుట్రకు బలాన్ని చేకూరుస్తోంది. డీఎంకే మాజీ మిత్రపక్షాల మద్దతు వల్లే విజయ్ సర్కార్ నడుస్తోందని స్టాలిన్ వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం విజయ్ పక్కా ప్రణాళికాబద్ధంగా తన వ్యూహాలను అమలు చేస్తూ డీఎంకే – అన్నాడీఎంకే కూటములపై గురి పెట్టారు. తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడంతో పాటు ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసే పనిలో పడ్డారు.

మరోవైపు, టీవీకే ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన భాగస్వామ్య పార్టీల నేతలంతా తాజాగా ఒకే వేదికపైకి వచ్చి తమ ఐక్యతను చాటారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా విజయ్ ప్రభుత్వం పూర్తి కాలం (ఐదేళ్లు) అధికారంలో కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలంతా సీఎం విజయ్ వెంటే ఉన్నారని, ప్రలోభాలకు లొంగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ ఉమ్మడి ప్రకటనతో టీవీకే శ్రేణుల్లో  ప్రభుత్వంలో కొత్త ఉత్సాహం నెలకొంది.

తమ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందంటూ ప్రతిపక్షాలు  కొన్ని ప్రత్యేక వర్గాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ముఖ్యమంత్రి విజయ్ తీవ్రంగా ఖండించారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ తమ ప్రభుత్వం పూర్తి కాలం విజయవంతంగా నడుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజకీయంగా తమను దెబ్బతీయాలని చూసే వారి కుతంత్రాలు, వ్యూహాలు తమిళనాడు మట్టిలో ఫలించవని గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

ప్రభుత్వ పనితీరు, కూటమి గమనంపై మాట్లాడిన ముఖ్యమంత్రి విజయ్, తమ ప్రయాణంలో రెండు ప్రధాన సూత్రాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. ప్రజల సొమ్మును ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయకుండా, పారదర్శకమైన అవినీతి రహిత పాలన అందించడమే తమ ప్రథమ లక్ష్యమన్నారు. అలాగే, అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూస్తూ, రాష్ట్రంలో లౌకికవాద విలువలను కాపాడతామని చెప్పారు.

“అవినీతిరహిత పాలన, లౌకికవాదం అనేవి మా ప్రభుత్వానికి రెండు కళ్లు. ఈ రెండు కీలకమైన అంశాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎంతటి ఒత్తిళ్లు వచ్చినా రాజీ పడే ప్రసక్తే లేదు” అని సీఎం విజయ్ స్పష్టం చేశారు.

తమిళనాడు ఇంటెలిజెన్స్ , క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ 180 కోట్ల కుట్ర కేసుపై లోతుగా దర్యాప్తును వేగవంతం చేశారు. బ్యాంక్ ఖాతాల లావాదేవీలు, డిజిటల్ ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. సీఎం విజయ్ పిలుపు మేరకు కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ మరింత సమన్వయంతో ముందుకు సాగుతుండటంతో.. ప్రస్తుతానికి ఈ రాజకీయ కుట్ర భగ్నమైనట్లే కనిపిస్తున్నా, రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని తమిళనాడు ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.