baned

BIG BREAKING : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి వెంటనే 7 బ్యాటరీ మేనేజ్‌మెంట్ యాప్‌లను తీసేయాలని కేంద్ర ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వం తీసేయమని చెప్పిన వాటిలో ‘BAT-BMS’, ‘SMART BMS’, ‘LOSSIGY’ లాంటి చైనా లింకులు ఉన్న యాప్‌లు ఉన్నాయి. బ్లూటూత్ ద్వారా నడుస్తున్న ఈ-రిక్షాలను, వేరే ఎలక్ట్రిక్ బండ్లను దూరం నుంచే స్విచ్ ఆఫ్ చేయడానికి ఈ యాప్‌లను వాడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

ఈ-రిక్షాలు నడుపుకుంటూ బతికే డ్రైవర్లను టార్గెట్ చేస్తూ, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ యాప్‌ల ద్వారా వారి బండ్లను అకస్మాత్తుగా బంద్ చేస్తున్నారు. దీంతో డ్రైవర్లు నడిరోడ్డుపై గంటల తరబడి బండి కదలకుండా ఉండిపోవాల్సి వస్తోంది. రోజువారీ సంపాదనతో ఇల్లు గడిచే పేద డ్రైవర్ల కడుపు కొడుతుండటంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. నిజానికి ఈ యాప్‌లను బ్యాటరీలో ఎంత ఛార్జింగ్ ఉంది, ఎంత వేడిగా ఉంది లాంటి విషయాలు చూసుకోవడానికి తయారు చేస్తారు. అయితే, తక్కువ ధరకు వచ్చే కొన్ని బ్యాటరీలలో సెక్యూరిటీ అస్సలు ఉండదు. వీటికి ఎలాంటి పాస్‌వర్డ్ కూడా ఉండదు. ఎవరైనా సరే బ్లూటూత్ ఆన్ చేసి వీటికి కనెక్ట్ అయిపోవచ్చు. ఈ తప్పును వాడుకుని, సదరు యాప్‌ల ద్వారా బ్యాటరీ కరెంట్ సప్లై కాకుండా పవర్‌ను ఆపేస్తున్నారు.

ఈ గొడవపై ఐటీ శాఖ అధికారి ఎస్. కృష్ణన్ మాట్లాడుతూ.. ఈ సమస్య తమ దృష్టికి వచ్చిందని, ఇప్పటికే కొన్ని యాప్‌లను స్టోర్స్ నుంచి తీయించేశామని చెప్పారు. ప్రజల సేఫ్టీకి, వారి సంపాదనకు నష్టం కలిగించే ఇలాంటి యాప్‌లు లేకుండా గూగుల్, యాపిల్ కంపెనీలతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. బండ్లను ఆపేసే ఏ యాప్ అయినా సరే ఊరుకునేది లేదని ప్రభుత్వం హెచ్చరించింది. 2020 నుంచి దేశ భద్రత కోసం వందల కొద్దీ చైనా యాప్‌లను బ్యాన్ చేసిన ప్రభుత్వం.. ఇలా బ్లూటూత్ యాప్‌ల దుర్వినియోగంపై ఈ స్థాయిలో యాక్షన్ తీసుకోవడం ఇదే మొదటిసారి.

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.