Exam Scam :  జైపూర్‌లోని ఒక పరీక్షా కేంద్రంలో జరుగుతున్న భారీ మాస్ కాపీయింగ్ ముఠా గుట్టును ఖోరా బిసాల్ పోలీసులు, డిస్ట్రిక్ట్ స్పెషల్ టీమ్ కలిసి రట్టు చేశారు. అక్కడ ఉన్న ప్రభా దేవి మెమోరియల్ పీజీ కాలేజీలో ఈ దందా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘోర అవినీతి బయటపడటంతో రాజస్థాన్ పారామెడికల్ కౌన్సిల్ వెంటనే స్పందించి, ఆ కాలేజీకి ఉన్న ఎగ్జామ్ సెంటర్ గుర్తింపును పూర్తిగా రద్దు చేసింది. అంతేకాకుండా అక్కడ జరగాల్సిన పలు డిప్లొమా పరీక్షలను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించింది.

పోలీసుల దర్యాప్తులో తేలింది ఏంటంటే.. ఝుంఝును ప్రాంతానికి చెందిన ఎస్. కరణ్ కాలేజ్ అనే ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్‌లో చదువులో బాగా వెనుకబడిన, అలాగే సబ్జెక్టులు బ్యాక్‌లాగ్ ఉన్న ఒక 45 మంది విద్యార్థులను ఎలాగైనా పాస్ చేయించాలని ఒక పెద్ద ప్లాన్ వేశారు. ఇందుకోసం ఆ రెండు కాలేజీల యాజమాన్యాల మధ్య ఏకంగా రూ. 5.50 లక్షల భారీ డీల్ కుదిరింది. ఈ ప్లాన్ ప్రకారం ఆ 45 మంది విద్యార్థులందరినీ ఒకే ఎగ్జామ్ హాల్‌లోకి వచ్చేలా సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. వారికి అనుకూలంగా ఉండే ఇన్విజిలేటర్లను అక్కడ డ్యూటీలో ఉంచి, ఎలాంటి భయం లేకుండా ఓపెన్‌గా చూసి రాసేలా ఏర్పాట్లు చేశారు.

Also Read : ఒక్క విరాళం…ఒక్క తప్పు.. అంతా తలకిందులు!

ఈ అక్రమ వ్యవహారంపై ముందే సమాచారం అందుకున్న ఒక ప్రత్యేక పోలీస్ బృందం.. పరీక్ష మొదలైన వెంటనే ఆ కాలేజీపై అకస్మాత్తుగా దాడి చేసింది. అక్కడ జరుగుతున్న మోసాన్ని పోలీసులు ఆధారాలతో సహా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ సెంటర్‌లో కాపీ కొట్టించాల్సిన విద్యార్థుల పేర్లు ఉన్న స్లిప్పులు, డబ్బుల లావాదేవీలు రాసుకున్న డైరీలు, అలాగే విద్యార్థుల హాల్ టికెట్లు ఉన్న స్మార్ట్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కామ్ వెనుక ఉన్న నలుగురు ముఖ్యమైన వ్యక్తులను అక్కడికక్కడే అరెస్ట్ చేశారు.

పోలీసులు అకస్మాత్తుగా దాడి చేయడంతో కాలేజీ క్యాంపస్‌లో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. కాలేజీ యాజమాన్యం ఇలా డబ్బులు తీసుకుని కొందరికి మాత్రమే దొంగచాటుగా హెల్ప్ చేస్తోందని తెలుసుకుని, అక్కడ పరీక్ష రాయడానికి వచ్చిన వందలాది మంది ఇతర సాధారణ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేస్తూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. తమ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారంటూ యాజమాన్యంపై మండిపడ్డారు.

Also Read : వాట్సాప్‌లో సూపర్ ప్రైవసీ ఫీచర్.. ఫోన్ నంబర్ లేకుండానే చాట్ చేసుకునే చాన్స్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.