Raviprakash

_ Ravi Prakash

Ayodhya Ram Mandir Scam :  కొన్ని రోజులుగా ఒకే ఒక్క వార్త గురించి దేశం మొత్తం చర్చిస్తోంది. అదే.. రామ్ మందిర్ విరాళాల వివాదం. దీనివల్ల ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి, రాజకీయ పార్టీలు ఆరోపణలు చేసుకుంటున్నాయి, విచారణలు నడుస్తున్నాయి, అలాగే కొందరు రాజీనామాలు కూడా చేశారు. అయితే, అసలు ఈ వివాదం ఎలా బయటకు వచ్చింది? కోట్లాది మంది భక్తులు ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఇది ఒక ఎఫ్ఐఆర్‌తో మొదలైందా? ఏదైనా పొలిటికల్‌ కంప్లైంట్‌తో మొదలైందా? లేదా, అంతకంటే ముందునుంచే ఈ వ్యవహారం నడుస్తోందా? పిడకల మధ్యలో లక్షలాది రూపాయల హుండీ డబ్బులు ఎందుకు దాచాల్సి వచ్చింది? అధికారికంగా పూర్తి వివరాలు తేలకపోయినా… అందిన సమాచారం ప్రకారం, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులతో జరిపిన సంభాషణల ఆధారంగా అసలు ఏం జరిగిందనేది చూద్దాం.

ఈ గొడవ బయటకు రాకముందే.. లోపల ఏదో తప్పు జరుగుతోందనే గుసగుసలు వినిపించాయి. ఈ వదంతులు లక్నోలోని పెద్దల దాకా వెళ్లాయి. రకరకాల చోట్ల ప్రశ్నలు తలెత్తాయి. కానీ అక్కడే ఒక పెద్ద సమస్య వచ్చింది. ఎలాంటి ఆధారాలూ లేవు. ఒట్టి వదంతులు ఆధారంగా చర్యలు తీసుకోలేరు. అందుకే పైస్థాయి అధికారుల నుంచి ఒకటే సమాధానం వచ్చింది, ఆధారాలు తీసుకురండి అని మే నెలలో జరిగిన ఒక సంఘటన ఈ కథను పూర్తిగా మార్చేసింది. ఒక భక్తుడు పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వాలని అనుకున్నాడు. ఆయన ఎంత ఇస్తున్నారనేది ముందే తెలుసు. ఆ డబ్బును అఫీషియల్ మెథడ్‌లోనే జమ చేశారు. అప్పట్లో అంతా మామూలుగానే అనిపించింది. అయితే, ప్రతీ నెల చేసే లెక్కింపులో తేడా కొట్టింది. ఆ నెల మొత్తం వివరాలు చూసినప్పుడు, సదరు భక్తుడు ఒక్కడే ఇచ్చిన విరాళం కంటే మొత్తం కలెక్షన్ తక్కువగా చూపించింది. ఇదే అధికారుల్లో అనుమానాన్ని పెంచింది.

ఇక్కడి నుంచే విచారణ అధికారులు లోతుగా పరిశీలించడం మొదలుపెట్టారు. ఫోన్లు మోగడం స్టార్ట్ అయ్యాయి. పై అధికారులకు సమాచారం వెళ్లింది. ఈ విషయం అయోధ్య దాటి బయటకు వచ్చింది. అయినా స్వతంత్రంగా తనిఖీ చేయడానికి ఒక బలమైన ఆధారం దొరకలేదు. రికార్డులను తనిఖీ చేయాలనే ఒత్తిడి పెరిగిన తర్వాత ఒక ముఖ్యమైన మలుపు వచ్చింది. విరాళాలు సేకరించే చోట ఉన్న సీసీటీవీ ఫుటేజీని చూడటానికి అనుమతి ఇచ్చారు. ఆ వీడియోలను పరిశీలించాక అసలు కథ అర్థమైంది. అందులో కనిపించిన విజువల్స్ దర్యాప్తును వేగవంతం చేశాయి. అప్పటివరకు ఉన్న అనుమానం, గట్టి ఆధారాల సేకరణ వైపు మళ్లింది. రామ్ మందిర్ లోపల అంతా సవ్యంగా లేదనే సమాచారం ముందే పైస్థాయికి చేరింది. లక్నోకు నమ్మదగిన సమాచారం అందింది. నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం కూడా ఆధారాలు అడిగింది. కానీ, ఆ సంస్థలోని కొందరు పెద్దలు ఒక మెయిన్ పర్సన్‌ని కాపాడటానికి ప్రయత్నించారు. మొదట్లో ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు అసలు ఈ విషయాన్ని వినడానికి కూడా సిద్ధంగా లేరు. కానీ మే నెలలో వచ్చిన ఆ భారీ విరాళంతో, లెక్కల తక్కెడ తేడా కొట్టడంతో అసలు విషయం బయటపడింది. అంతా ఒక్కసారిగా మారిపోయింది.

Also Read : దేశ రవాణా రంగంలో సరికొత్త విప్లవం: 2027 ఆగస్టులో పట్టాలెక్కనున్న తొలి బుల్లెట్‌ రైలు!

అనుమానాలు నిజమేనా అని తేల్చడానికి సీసీటీవీ ఫుటేజీని చూసినప్పుడు అసలు దొంగలు దొరికారు. హుండీ డబ్బును హ్యాండిల్ చేసే కొందరు వ్యక్తులు తప్పు చేస్తున్నట్లు అందులో స్పష్టంగా కనిపించింది. దాంతో ఆ వీడియోల్లో ఉన్నవారిని పిలిచి విచారించారు. వారి ఇళ్లల్లో సోదాలు చేశారు. వేర్వేరు వ్యక్తుల నుంచి అధికారులు సుమారు 80లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. దాంతో కథ పూర్తిగా మారిపోయింది. కేవలం డబ్బు పోయిందా లేదా అని కాకుండా, ఇదొక పెద్ద కుంభకోణమా అనే కోణంలో దర్యాప్తు మొదలైంది. ఈ విషయాలన్నీ లక్నోలోని ఉన్నతాధికారులకు, అలాగే ఢిల్లీ, నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనాయకత్వానికి చేరాయి. ఇలాంటి సమయంలోనే ఒక చర్చ నడిచింది. వెంటనే క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేయాలా? లేక పూర్తిగా విచారణ జరిపించాలా? అని ఆలోచించారు. చివరికి ఆధారాలతోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ నెట్‌వర్క్ ఎలా పనిచేస్తోంది? ఇంకా ఎవరెవరు ఉన్నారు, వారి పాత్ర ఏంటి..? అనే విషయాలపై లోతైన దర్యాప్తు మొదలైంది.

జూన్ 4న సీసీటీవీ ఫుటేజీని పూర్తిగా పరిశీలించారు. అక్కడ ఎలాంటి రహస్య కెమెరాలు పెట్టలేదు, అవసరమూ రాలేదు. ఎందుకంటే దొంగతనం చేసేవారికి ముందే సమాచారం అందుతోంది. పైనుంచి తీవ్ర ఒత్తిడి రావడంతోనే చంపత్ రాయ్ ఆ సీసీటీవీ ఫుటేజీ చూడటానికి ఒప్పుకున్నారు. అందులో ఎనిమిది మందిలో ఏడుగురు దొంగతనం చేస్తూ దొరికిపోయారు. దాంతో చంపత్ రాయ్‌లో కంగారు మొదలైంది. ఆ ఆధారాలు లక్నో, ఢిల్లీ, నాగ్‌పూర్ చేరాయి. జూన్ 6న చంపత్ రాయ్ ఒక పెద్ద తప్పు చేశారు. ఆయన ధోతి, కుర్తా వేసుకుని నేరుగా ఒక నిందితుడి ఇంటికి వెళ్లారు. ఆయనతో పాటు కొందరు నమ్మకస్థులైన పోలీసులు కూడా ఉన్నారు. సీసీటీవీలో దొరికిన వారిని పోలీసులు ప్రశ్నించినప్పుడు నిజాలు బయటకు వచ్చాయి. ఒక నిందితుడు ప్రతి నెలా విరాళాల సొమ్ము నుంచి రూ.2 లక్షలు తన భార్య బ్యాంకు ఖాతాలో వేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఇంకొకడు హాస్టల్‌లో దాచిన రూ.20 లక్షలు తీసిచ్చాడు. మరొకడైతే ఏకంగా పిడకల మధ్యలో దాచిన రూ.10 లక్షలు చూపించాడు.

ఈ రికవరీల తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టులు చేయాలని ఆదేశించారు. కానీ, ఢిల్లీలోని ఒక కేంద్ర మంత్రి చంపత్ రాయ్‌తో మాట్లాడారు. చంపత్ రాయ్ కూడా ఢిల్లీ, నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ పెద్దల మద్దతు కోసం ప్రయత్నించారు. నిందితుల్లో ఏడుగురిని గుడి ప్రాంగణంలోని ఒక గదిలో బంధించారు. కానీ చంపత్ రాయ్‌కు అత్యంత ఆప్తుడైన ‘తిన్ను యాదవ్’ అనే వ్యక్తిని మాత్రం ప్రత్యేక ఆదేశాలతో ఫ్రీగా వదిలేశారు. చంపత్ రాయ్ పైవారితో మాట్లాడుతూ.. “ఇది చిన్న విషయం, అందరూ సారీ చెప్పి డబ్బు తిరిగి ఇచ్చేశారు, కేసు పెడితే సంస్థ పరువు పోతుంది” అని కవర్ చేయడానికి చూశారు. సంఘ్ పరివార్‌లోని ఒక వర్గం ఆయనను కాపాడాలని చూసినా.. ప్రధాని, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనేతలు మాత్రం “నిజం బయటకు రావాల్సిందే” అని తేల్చి చెప్పారు. నెలకు రూ.20వేలు జీతం తీసుకునే ఉద్యోగులు మూడేళ్లలో కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించారని లక్నో సిట్ గుర్తించింది. వారి ఆస్తుల పూర్తి లిస్టును తయారు చేసి సిట్ టీమ్ అయోధ్యలో అడుగుపెట్టింది.

అయోధ్యకు వచ్చిన ముగ్గురు సిట్ ఆఫీసర్లకు చంపత్ రాయ్ అడ్డుతగిలారు. మొదట తననే ప్రశ్నించాలన్నారు. కానీ లక్నో నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఆఫీసర్లు లొంగలేదు. గుడి సిబ్బంది, బ్యాంక్ ఉద్యోగులు, సెక్యూరిటీ ఇలా అందరినీ విచారించారు. విరాళాల డబ్బును ఎలాంటి తనిఖీలు లేకుండానే బ్యాగుల్లో సర్ది, బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నట్లు తేల్చారు. ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న నెట్‌వర్క్ అని రిపోర్ట్‌ సిద్ధం చేశారు. లక్నో తిరిగి వెళ్లాక, ఈ విషయం బయటకు రానీయకుండా చూశారు. నివేదికను పర్యవేక్షించిన ఐఏఎస్ ఆఫీసర్‌కు హిందీ టైపింగ్ రాకపోవడంతో, రోమన్ అక్షరాలను హిందీలోకి మార్చే సాఫ్ట్‌వేర్ వాడి ఆయనే స్వయంగా రిపోర్ట్ టైప్ చేశారు. “ఎవరినీ కాపాడొద్దు, ప్రతి విషయానికి ఆధారం ఉండాలి” అనే ఆదేశాలు పైనుంచి వచ్చాయి.

ఆ నివేదికలో చంపత్ రాయ్ నిర్లక్ష్యం, దొంగలను కాపాడటం, దొంగతనం తెలిసినా కేసు పెట్టకుండా ఆపడం వంటి తప్పులను ఎత్తి చూపారు. దాంతో చంపత్‌రాయ్ రాజీనామా చేయాలనే డిమాండ్‌ పెరిగింది. నృపేంద్ర మిశ్రా ఢిల్లీకి ఈ విషయాలన్నీ ముందే చెప్పారు. ఢిల్లీ నుంచి “చంపత్ రాయ్ రాజీనామా చేయాల్సిందే” అనే ఆర్డర్ వచ్చింది. పైగా, వీహెచ్‌పీలో చంపత్‌రాయ్‌కున్న బాధ్యతలను తొలగించాలని నిర్ణయించారు. హరిద్వార్‌లో జరిగిన వీహెచ్‌పీ సమావేశంలో ఆయనకు దారులు మూసుకుపోయాయి. నాగ్‌పూర్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం వీహెచ్‌పీ జనరల్ సెక్రటరీ అయోధ్యకు వచ్చి చంపత్ రాయ్‌ను రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించారు.

Also Read : క్రికెట్ అభిమానులకు శుభవార్త.. టీమిండియా బెర్త్ ఖరారు!

జూన్ 23న గుడిలో జరిగిన జెండా పండగ కార్యక్రమం తర్వాత, చంపత్‌రాయ్‌ను పంపించేయాలని చూశారు. కానీ విచారణ ముగిసేదాకా ఉంటానని చంపత్ రాయ్ పట్టుబట్టారు. దాంతో జూన్ 24 సాయంత్రం 4 గంటలకు వీహెచ్‌పీ సీరియస్‌ అయింది. కేసు పెడతామని, ఎవరినీ వదిలేది లేదని నాలుగు పాయింట్ల ప్రకటన విడుదల చేసింది. ఆ రాత్రి చంపత్ రాయ్‌కు చాలా కష్టంగా గడిచింది. ఢిల్లీ, నాగ్‌పూర్ నుంచి ఫోన్లు కలవలేదు. ఖాళీ కాగితంపై రాజీనామా లేఖ సిద్ధంగా ఉంది. లక్నో నుంచి ఒకటే మాట వచ్చింది, ఈ విషయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు అని’.

చివరిగా చెప్పాలంటే.. ఈ వివాదం కేవలం డబ్బు గురించి కాదు, కోట్ల మంది భక్తుల నమ్మకానికి సంబంధించింది..! భగవంతుడి పాదాల దగ్గర భక్తులు ఉంచిన కానుకల విషయంలో ఇలా జరగడం వారి మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రభుత్వ రికార్డుల ఆధారంగా, మాకు అందిన సమాచారం ఆధారంగా ఈ రిపోర్టును మీముందుకు తెచ్చాం. కోర్టులు, లీగల్ ప్రాసెస్ ద్వారా అసలు నిజాలు త్వరలోనే పూర్తిగా బయటకు వస్తాయి. కానీ భక్తుల మనసుల్లో ప్రశ్నలు మాత్రం మిగిలే ఉన్నాయి. మొదట్లోనే సరైన పర్యవేక్షణ, కఠినమైన చర్యలు ఉండి ఉంటే.. ఈ వివాదానికే తావు ఉండేది కాదు! ఎందుకంటే భక్తి ఉన్నచోట నమ్మకమే అన్నింటికంటే గొప్పది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.