దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన పుణె యువ రియల్టర్‌ కేతన్‌ అగర్వాల్‌ (26) దారుణ హత్య కేసు విచారణలో రోజుకో షాకింగ్‌ విషయం వెలుగులోకి వస్తోంది. కేతన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని నిందితురాలు సియా గోయల్‌, తన ప్రియుడు చేతన్‌తో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో అంగీకరించింది. ఇంట్లో కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పి, వారిని బాధపెట్టి నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడం కంటే.. కాబోయే భర్త కేతన్‌ను చంపేయడమే సులభమని తాను భావించినట్లు సియా ఒప్పుకోవడం పోలీసులనే దిగ్భ్రాంతికి గురిచేసింది. నిశ్చితార్థం రద్దు చేసుకుని పారిపోయి పెళ్లి చేసుకుందామని చేతన్ కోరినప్పటికీ, కుటుంబ గౌరవానికి భంగం కలుగుతుందనే కారణంతో సియా అందుకు అంగీకరించకుండా ఈ దారుణమైన కుట్రకు తెరలేపింది.

Also Read : త్రిపుల్ మర్డర్ కేసులో కన్నకూతురే హంతకురాలు: పుదుచ్చేరిలో అరెస్ట్!

బెదిరింపులు.. పక్కా స్కెచ్:

పుణె సమీప లోహ్‌గఢ్‌ కోట వద్ద లోయలోకి తోసి కేతన్‌ను హత్య చేయాలని సియాను ఆమె ప్రియుడు చేతన్‌ తీవ్రంగా ప్రేరేపించినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ఒకవేళ పెళ్లి ఆపకపోతే అంతకుమునుపు జరిగిన విషయాలను బయటపెడతానని చేతన్ ఆమెను బెదిరించినట్లు కూడా తెలిసింది. హత్య జరిగిన రోజు పక్కా ప్రణాళిక ప్రకారం కేతన్‌ కొండ అంచు వద్దకు చేరుకున్నాక సియా తన ప్రియుడికి సంకేతం ఇచ్చింది. ఆ సిగ్నల్ అందడమే ఆలస్యం.. వెనుక నుంచి పొంచి ఉన్న చేతన్‌ ఒక్కసారిగా పైకి చేరుకొని కేతన్‌ను లోయలోకి నెట్టేసి అంతమొందించాడు.

పోలీసుల ఆరు బృందాల దర్యాప్తు.. కాల్ డేటా:

ఈ హైప్రొఫైల్ కేసును చేధించేందుకు పుణె, లోనావాలా పోలీసులు రంగంలోకి దిగి ఏకంగా ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే లోనావాలా సిటీ పోలీస్‌ స్టేషన్‌లో సియా తల్లిదండ్రులను సుదీర్ఘంగా విచారించగా, ఆమె సోదరుడు సాహిల్‌ను రెండోసారి పిలిపించి దాదాపు 10 గంటల పాటు విచారించారు. చేతన్‌ చౌధరి తనకు తెలుసని, గతేడాది దీపావళి పార్టీ తర్వాత సియా, చేతన్‌ల మధ్య సాన్నిహిత్యం విపరీతంగా పెరిగిందని సాహిల్ పోలీసులకు తెలిపాడు. జనవరి నుంచి వీరిద్దరూ ఏకంగా 2వేల సార్లు దాదాపు 238 గంటల పాటు ఫోన్లలో సంభాషించుకున్నట్లు పోలీసులు వారి కాల్ రికార్డుల ద్వారా గుర్తించారు.

డిజిటల్ సాక్ష్యాల వేట:

హత్య అనంతరం పోలీసులకు దొరకకుండా ఉండేందుకు సియా, చేతన్‌లు తమ మొబైల్‌ ఫోన్‌ల నుంచి డేటా మొత్తాన్ని పూర్తిగా డిలీట్ చేశారు. ఈ కేసులో కుట్ర కోణాన్ని పక్కాగా రుజువు చేసేందుకు వీలుగా, నిందితుల ఫోన్లను పోలీసులు ఫోరెన్సిక్‌ ల్యాబుకు పంపించి ఆ డిజిటల్ డేటాను తిరిగి పొందేందుకు (రికవరీ) ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ తీవ్రంగా స్పందిస్తూ పుణెలో కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్‌ను కలిసి పరామర్శించారు. ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరిపించి దోషులకు కఠినశిక్ష పడేలా చూస్తామని హామీ ఇవ్వడమే కాకుండా, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్‌ నికమ్‌ను ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటరుగా నియమిస్తూ సీఎంవో ‘ఎక్స్‌’ వేదికగా ఉత్తర్వులు జారీ చేసింది.

తల్లిదండ్రుల కన్నీటి పర్యంతం.. ఐసీయూలో తండ్రి:

ఈ ఘోర ఉదంతం తర్వాత తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సియా గోయల్‌ తండ్రి ప్రవీణ్‌ గోయల్‌ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ను ఐసీయూలో చేర్చారు. తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన సియా తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కేతన్‌ అగర్వాల్‌ విగ్గు వాడుతుండటం వల్లే సియాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటూ వస్తున్న వార్తలను వారు పూర్తిగా తోసిపుచ్చారు. ఆ సంగతి సియాకు ముందే తెలుసని, కేతన్ కుటుంబంతో తమకు ఎన్నో ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఈ దారుణంతో తాము ఒక మంచి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని మాత్రమే కాకుండా, ఒక మంచి కుమారుడిని కూడా కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : ఏఐ సాయంతో ఫేక్ ‘నీట్’ ప్రశ్నపత్రం సృష్టి.. ఇండోర్‌లో లా విద్యార్థి అరెస్ట్

తప్పు చేస్తే మరణశిక్ష వేయండి:

సియా తల్లి పూజా మీడియాతో మాట్లాడుతూ.. ఆ రోజు సియా అసలు లోహ్‌గఢ్‌ కోటకు వెళ్లడానికి ఇష్టపడలేదని, కేతన్‌తో పాటు ఆయన తల్లి వీడియోకాల్‌ ద్వారా బలవంతం చేయడం వల్లే వెళ్ళిందని తెలిపారు. తమ కుమార్తె ఇంతటి దారుణానికి పాల్పడుతుందని తాము ఊహించలేదని, ఆమె ఇష్టప్రకారమే ఈ పెళ్లి నిశ్చయించామని స్పష్టం చేశారు. అసలు సియా నోటి నుంచి చేతన్‌ చౌధరీ పేరును తాము ఎప్పుడూ వినలేదని, ఒకవేళ విచారణలో సియానే నేరం చేసినట్లు తేలితే ఆమెకు మరణశిక్ష విధించాలని, లేదా అదే కోట పైనుంచి కిందకు తోసేయాలంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.