swetha

Bengaluru : మానవ సంబంధాలు ఎంతలా దిగజారిపోతున్నాయో చెప్పడానికి బెంగళూరులో జరిగిన ఈ ఘోర ఘటనే ఒక ఉదాహరణ. కన్న తల్లిదండ్రులను, తోడబుట్టిన చెల్లెలిని అత్యంత క్రూరంగా కత్తులతో పొడిచి చంపిన కన్నకూతురు శ్వేత ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయింది. బెంగళూరు కేఆర్ పురంలో ఈ దారుణానికి ఒడిగట్టి పరారైన ఆమెను పుదుచ్చేరి రైల్వే స్టేషన్‌లో కృష్ణరాజపురం పోలీసులు అరెస్ట్ చేశారు. “నా తల్లిదండ్రులు నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్టు బతకనివ్వలేదు.. నన్ను కంట్రోల్ చేయాలని చూశారు. నాకు అస్సలు స్వేచ్ఛ లేకుండా చేశారు. అందుకే నేనే వారిని చంపేశాను” అని శ్వేత పోలీసుల ప్రాథమిక విచారణలో ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా అంగీకరించడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.

ఈ ఘోర హత్యలకు సహకరించిన శ్వేత ప్రియుడు కెనెత్ కోసం పోలీసులు ప్రస్తుతం తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి ఆరు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్, డీసీపీ సైదులు అడావత్ తెలిపారు. హత్యలు జరిగిన ఫ్లాట్‌లో పోలీసులు శ్వేతకు సంబంధించిన ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆమె “నాకు జీవితమంతా బాధలే.. ఒంటరినై పోయాను.. ప్రేమ కావాలి.. ఒత్తిడిలో నలిగిపోతున్నా.. అయినా నేనే గొప్ప” అంటూ పలు చోట్ల రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

బ్యాంకు లోన్ కట్టకపోవడంతో ఆ నోటీసులు కాస్త శ్వేత తండ్రి ఉంటున్న ఇంటికి వెళ్లాయి. దాంతో అసలు విషయం బయటపడింది. మరోవైపు ప్రియుడు కెనెత్ తండ్రి హెచ్‌ఏఎల్‌ (HAL)లో ఉద్యోగి అయినప్పటికీ.. కెనెత్‌కు అతని కుటుంబం నుండి ఎలాంటి సాయం అందడం లేదు. అప్పుల పాలైన శ్వేత, కెనెత్ గత రెండు నెలలుగా డామినిక్ లేఅవుట్లోని సాయిగ్రీన్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే కూతురికి బుద్ధిమాటలు చెప్పి నచ్చజెప్పాలని శ్వేత తండ్రి సోమసుందర.. తన భార్య ముత్తులక్ష్మి, చిన్న కుమార్తె సుప్రియను తీసుకుని సోమవారం రాత్రి శ్వేత ఉంటున్న ఫ్లాట్‌కు వచ్చారు.

అక్కడ అందరి మధ్య మాట మాట పెరిగి గొడవ తీవ్రరూపం దాల్చింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన శ్వేత, కెనెత్ ఇద్దరూ కలిసి ఇంట్లోనే ఉన్న కత్తులతో కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ముగ్గురిని కలిపి దాదాపు 35 నుండి 40 సార్లు పొడిచి అత్యంత దారుణంగా ప్రాణాలు తీశారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.