
NEET-UG : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ (NEET-UG) పరీక్షల నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో ఒక విస్తుపోయే ఉదంతం వెలుగుచూసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి నకిలీ నీట్ ప్రశ్నాపత్రాన్ని సృష్టించి, దాన్ని సోషల్ మీడియాలో విక్రయిస్తున్న ఒక లా (Law) విద్యార్థిని ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని లసుడియా ప్రాంతానికి చెందిన మొదటి సంవత్సరం లా విద్యార్థి అక్షయ్ మాల్వియాగా గుర్తించారు. తక్కువ శ్రమతో సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో అతడు ఈ దందాకు తెరలేపినట్లు పోలీసులు నిర్ధారించారు.
నిందితుడు అక్షయ్ మాల్వియా ఏఐ సాయంతో అచ్చం ఒరిజినల్ పేపర్‌ను పోలినట్లు ఉండే నకిలీ నీట్ క్వశ్చన్ పేపర్‌ను తయారు చేశాడు. ఆపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తూ ఈ పేపర్లను అమ్మకానికి పెట్టాడు. ఈ మోసానికి సంబంధించిన వివరాలను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) రాజేష్ కుమార్ త్రిపాఠి వెల్లడిస్తూ..
“నిందితుడు ఒక్కో ప్రశ్నాపత్రానికి రూ.50 నుండి రూ.100 వరకు మాత్రమే వసూలు చేశాడు. ధర చాలా తక్కువగా ఉండటంతో లీక్ నిజమేనని నమ్మి పలువురు విద్యార్థులు దీనిని కొనుగోలు చేశారు. ఇలా దాదాపు 25 మందికి నకిలీ పేపర్లను విక్రయించి రూ.30,000 వరకు అక్రమంగా ఆర్జించాడు. సోషల్ మీడియాపై నిరంతరం నిఘా ఉంచిన క్రైమ్ బ్రాంచ్ బృందం నిందితుడిని అదుపులోకి తీసుకుంది. ఈ నకిలీ పేపర్‌కు, ఆదివారం జరిగిన అసలు నీట్ పరీక్షకు ఎలాంటి సంబంధం లేదు.” అని స్పష్టం చేశారు.
ప్రస్తుతం నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 318(4) (చీటింగ్), ఐటీ యాక్ట్ సెక్షన్ 66 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లీక్ వార్తలపై స్పందించిన ఎన్‌టీఏ (NTA)
మరోవైపు, దేశవ్యాప్తంగా ఆదివారం నీట్ రీ-టెస్ట్ ముగిసిన తరుణంలో.. ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఒక వీడియోపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తీవ్రంగా స్పందించింది. ఆ వీడియో ముమ్మాటికీ నకిలీదని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా విజ్ఞప్తి చేసింది. అవాస్తవాలను సృష్టించి విద్యార్థులను భయాందోళనలకు గురిచేయడం తీవ్రమైన నేరమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కేవలం అధికారిక వెబ్‌సైట్ సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది.
గత మే 3న జరిగిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ 20 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఆదివారం పునః పరీక్ష నిర్వహించారు. దిల్లీలోని ఎన్‌టీఏ ప్రధాన కార్యాలయం నుంచి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ ప్రక్రియను స్వయంగా సమీక్షించారు. అన్ని ప్రభుత్వ విభాగాల సహకారంతో రికార్డు స్థాయిలో కేవలం 37 రోజుల్లోనే ఈ రీ-ఎగ్జామ్‌ను దిగ్విజయంగా పూర్తి చేశామని ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ వెల్లడించారు.









