arrest

AP Crime : పెళ్లి పేరుతో అమాయక వరులను బురిడీ కొట్టిస్తూ, లక్షల రూపాయలు వసూలు చేసి పారిపోతున్న ఒక నిత్య పెళ్లికూతురు ఉదంతం అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది. వరుస పెళ్లిళ్లతో హల్‌చల్ చేస్తున్న వజ్రపు మనీ అలియాస్ శ్వేతారెడ్డి అలియాస్ కీర్తి అనే కిలేడీని, ఆమె వెనకుండి నడిపిస్తున్న ముఠాను అనంతపురం పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

Also Read : కుల రాజకీయాలు, అసత్య ప్రచారాలను తిప్పికొట్టండి: మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం!

కీర్తికి పెళ్లి కుదిర్చి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా దొండపూడి గ్రామానికి చెందిన కీర్తి, ఒక ముఠాగా ఏర్పడి ఈ మోసాలకు తెరలేపింది. ఈమెకు విజయవాడకు చెందిన సుమప్రియ, అశోక్‌, శశికళ, రామకృష్ణ అనే నలుగురు వ్యక్తులు సహకరించేవారు. వీరంతా కలిసి ఒక పక్కా ప్లాన్ ప్రకారం పెళ్లికాని యువకులను టార్గెట్ చేసేవారు. కీర్తికి పెళ్లి కుదిర్చి.. ఒక్కో పెళ్లికి రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు కమీషన్ లేదా ఖర్చుల రూపంలో వసూలు చేసేవారు. పెళ్లి జరిగిన తర్వాత కేవలం 6 రోజులు కూడా గడవక ముందే కీర్తి అక్కడ ఉన్న డబ్బు, నగలతో పరారవ్వడం ఈ గ్యాంగ్ స్టైల్. ఇలా ఈమె ఇప్పటివరకు ఐదుగురిని పెళ్లి చేసుకుని మోసం చేసింది.

అనంతపురం జిల్లా పెద్దవడుగూరుకు చెందిన సుధీర్‌ రెడ్డి అనే యువకుడిని 2025లో కీర్తి పెళ్లి చేసుకుంది. అయితే, పెళ్లయిన ఐదు రోజులకే ఆమె ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయింది. దీనిపై తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సుధీర్ రెడ్డి.. తాను మోసపోయానని గ్రహించి పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి కీర్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సుధీర్ రెడ్డిని మోసం చేసి పారిపోయిన కీర్తి.. ఆ తర్వాత తన గ్యాంగ్‌తో కలిసి కర్ణాటకకు చేరింది. అక్కడ మల్లెకుప్పం అనే ప్రాంతంలో మరో వ్యక్తిని ఐదో పెళ్లి చేసుకుంది. అక్కడ కూడా తన చేతివాటం ప్రదర్శించి, బాధితుడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. అయితే టెక్నికల్ సహాయంతో నిందితుల కదలికలను నిరంతరం గమనిస్తున్న అనంతపురం పోలీసులు.. కీర్తి కర్ణాటక నుంచి పారిపోతుండగా చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలో పక్కా ప్లాన్‌తో పట్టుకున్నారు.

నిత్య పెళ్లికూతురు కీర్తితో పాటు ఆమెకు సహకరించిన విజయవాడ ముఠాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇలాంటి మాయలేడీల పట్ల, దళారుల పట్ల పెళ్లికాని యువకులు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Also Read : రాధా గాయత్రి కేసులో బిగ్ ట్విస్ట్.. భర్త వేధింపులపై ఆడియో లీక్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.