
Radha Gayatri : ముస్సోరిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వైజాగ్ టెక్కీ రాధా గాయత్రి కేసు దర్యాప్తును పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పుడు ఒక సంచలన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. రాధా గాయత్రి మరణించడానికి కొన్ని రోజుల ముందు తన తల్లికి పంపిన చివరి ఆడియో మెసేజ్ ఇప్పుడు బయటపడింది. భర్త శ్రీచరణ్ పెట్టే మానసిక నరకాన్ని, అతని వింత ప్రవర్తనను తట్టుకోలేకపోతున్నానంటూ గాయత్రి ఆ ఆడియోలో కన్నీరు పెట్టుకుంటూ ఆవేదన వ్యక్తం చేయడం సంచలనంగా మారింది.
తన భర్త శ్రీచరణ్ ప్రవర్తనతో మనసు పూర్తిగా విరిగిపోయిందని గాయత్రి ఆ వాయిస్ మెసేజ్‌లో తన తల్లితో వాపోయింది. పెళ్లయిన కొద్దిరోజుల నుంచే అతను తనపై తీవ్ర అనుమానం పెంచుకున్నాడని, సమాజంలో తన గురించి చెడుగా ప్రచారం చేస్తూ మానసికంగా వేధిస్తున్నాడని కన్నీళ్లు పెట్టుకుంది. ఇన్నాళ్లు కాపురాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఎంతో ఓపిక పట్టానని, కానీ ఇప్పుడు అతను అన్ని లిమిట్స్ క్రాస్ చేసి ప్రవర్తిస్తున్నాడని, ఇకపై అతని చేష్టలను భరించే ఓపిక తనకు ఏమాత్రం లేదని గాయత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. చివరికి శ్రీచరణ్‌తో మాట్లాడాలని కూడా తనకు అనిపించడం లేదంటూ తన బాధనంతా తల్లి ముందు వెళ్లగక్కింది.
ప్రస్తుతం ఈ ఆడియో మెసేజ్ సోషల్ మీడియాతో పాటు దర్యాప్తులో అత్యంత కీలకంగా మారింది. గాయత్రి తల్లిదండ్రులు ఈ వాయిస్ రికార్డింగ్‌ను పోలీసులకు అందజేయడంతో, దీనిని ఒక ముఖ్యమైన సాక్ష్యంగా పరిగణిస్తూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. నవంబర్ 2025లో వివాహం జరిగిన ఈ యువతి, ముస్సోరి ట్రిప్‌కు వెళ్లిన చోట ఇలా అనుమానాస్పదంగా శవమై తేలడం వెనుక భర్త శ్రీచరణ్ వేధింపులే కారణమనే అనుమానాలు బలంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడు శ్రీచరణ్ కోసం ప్రత్యేక బృందాలతో తీవ్రంగా గాలిస్తున్నారు.
నాకు ఎలాంటి సంబంధం లేదు
మరోవైపు, గాయత్రి మరణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని భర్త శ్రీచరణ్ వాదిస్తున్నాడు. ముస్సోరీలోని హోటల్ రూమ్‌లో తామిద్దరం రెడ్ వైన్ తాగామని, ఆ తర్వాత తెల్లారి లేచి చూసేసరికి గాయత్రి చలనం లేకుండా పడి ఉందని, ఆమెకు బీపీ సమస్య ఉందని పోలీసులకు తెలిపాడు. అయితే, గాయత్రికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. అలాగే, పోలీసులు సదరు హోటల్ యాజమాన్యాన్ని విచారించగా.. మా హోటల్‌లో అసలు ఆల్కహాల్‌కే అనుమతి లేదని తేల్చి చెప్పారు. దీనికి తోడు గాయత్రి మరణించిన సమయంలో ఆమె ముక్కు నుంచి రక్తం కారినట్లు పోలీసులు గుర్తించారు. భార్య కుటుంబ సభ్యులకు శ్రీచరణ్ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఎఫ్‌ఐఆర్‌లో కూడా పోలీసులు పొందుపరిచారు.









