
Fishermens missing :ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విషాదం నెలకొంది. సముద్రవేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు తిరిగిరాలేదు.అల్లవరం మండలం ఓడలరేవు తీరం నుంచి ఈ నెల 3న సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 7గురు మత్స్యకారుల బోటు గల్లంతైంది. 13వ తేదీన తిరిగి రావాల్సిన వీరు.. ఇప్పటికీ ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఫోన్లకు కూడా వారు స్పందించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మెరైన్ పోలీసులకు, మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.
ఏడుగురు మత్స్యకారులు 3నసముద్రంలోకి వెళ్లిన గంటకే వారి సెల్‌ఫోన్ సిగ్నల్ కట్ అయినట్లు తెలుస్తోంది. అయితే వాతావరణ శాఖ అధికారులు —తుఫాను హెచ్చరికలు జారీ చేసినా మత్స్యకారులు వేటకు వెళ్లినట్లు చెబుతున్నారు. దీంతో మెరైన్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో —బోటు ఆచూకీ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. వీరంతా కోపనాతి రామకృష్ణ ఆధ్వర్యంలో సముద్రంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.మిస్సింగ్‌లో కోనసీమకు చెందిన వివిధ గ్రామాల మత్స్యకారులు ఉన్నారు.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ వెంటనే స్పందించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గల్లంతైన బోటులో 15 రోజులకు సరిపడా రేషన్, వెయ్యి లీటర్ల డీజిల్ ఉందని అధికారులు ఆయనకు వివరించారు. బోటు విశాఖ, పారాదీప్ వైపు వెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించామని కలెక్టర్ వెల్లడించారు. గాలింపు చర్యల కోసం కోస్ట్‌గార్డ్‌ను అప్రమత్తం చేసి సహాయక చర్యలు ముమ్మరం చేశామని ఆయన తెలిపారు.
కాగా, గల్లంతైన వారిలో కోపనాతి రామకృష్ణ (కొమరగిరిపట్నం), పాలెపు శాంతారావు (ఓడలరేవు), ఏసుదాస్ (అడగట్లపాలెం),సంఘాని తాతారావు (కాట్రేనికోన మండలం బలుసుతిప్ప), కొల్లాటి శ్రీనివాస్ (ఓడలరేవు), కర్రి రాముడు (నక్క రామేశ్వరం) ,కాటాడి సతీశ్ (పశువులంక)లతో పాటు మరొకరు ఉన్నట్లు తెలుస్తోంది.









