అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం తగ్గినట్లే. కానీ హర్మూజ్ జలసంధి విషయంలో మాత్రం సందిగ్ధత కొనసాగుతోంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు నిరసనగా ఈ సముద్ర మార్గాన్ని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. కానీ ఇంకా తెరిచే ఉందని అమెరికా వాదిస్తోంది. ఈ మార్గంపై పూర్తి నియంత్రణ తమదేనని ఇరాన్ అంటుంటే.. అక్కడ తామే టోల్ టాక్స్ వసూలు చేస్తామని అమెరికా హెచ్చరిస్తోంది.

Also Read : అమెరికాలో చదవాలనుకునే విద్యార్థులకు షాక్.. ఇకపై నాలుగేళ్లు మాత్రమే సమయం

Tensions In Hormuz

అయితే ప్రస్తుతం హర్మూజ్ జలసంధి పూర్తిగా మూతపడలేదు. సముద్రంలో మైన్లు ఉంచడం వల్ల ప్రధాన మార్గంలో నౌకల రాకపోకలు ఆగిపోయినప్పటికీ, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రతిరోజూ కొన్ని పదుల సంఖ్యలో నౌకలు ప్రయాణిస్తున్నాయి. అయితే గతంలో ఉన్నంత భారీ స్థాయిలో వ్యాపార రవాణా మాత్రం జరగడం లేదు. భౌగోళికంగా హర్మూజ్ జలసంధి ఇరాన్, ఒమన్ దేశాల మధ్య ఉంది. ఇది ఏ ఒక్క దేశానికీ సొంతం కాదు. యుద్ధానికి ముందు ఇక్కడ నౌకల ప్రయాణం ఉచితంగా సాగేది. కానీ ఉద్రిక్తతల సమయంలో ఇరాన్ ఈ మార్గాన్ని తన ఆధీనంలోకి తీసుకుని కొన్ని నౌకల నుండి టోల్ వసూలు చేసింది. అమెరికాతో కుదిరిన తాత్కాలిక ఒప్పందం ప్రకారం రాబోయే 60 రోజుల వరకు టోల్ వసూలు చేయకూడదని ఇరాన్ అంగీకరించింది. ఈ లోపు ఈ మార్గ నిర్వహణపై ఒమన్, ఇతర గల్ఫ్ దేశాలతో ఇరాన్ చర్చలు జరుపుతోంది.

ఇరాన్ ఇప్పటికే పర్షియన్ గల్ఫ్ జలసంధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసి ఈ మార్గం గుండా వెళ్లే నౌకలన్నీ తమ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని ఆదేశించింది. భవిష్యత్తులో టోల్ వసూలు చేయడానికే ఇరాన్ ఈ ఏర్పాటు చేసిందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇక్కడ తామే టోల్ వసూలు చేస్తామని ప్రకటించారు. అయితే అంతర్జాతీయ జలాల్లో ఇలా టోల్ వసూలు చేయడం అనేది ప్రపంచ వాణిజ్య నియమాలకు విరుద్ధమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read : మేడ్ ఇన్ ఇండియా పవర్‌.. బ్రహ్మోస్, ఆకాశ్‌తీర్ కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్న దుబాయ్!