మన దేశంలో తయారవుతున్న రక్షణ ఆయుధాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. గల్ఫ్ దేశాలలో భద్రతా సమస్యలు ఎక్కువ కావడంతో దుబాయ్ మన దేశం నుంచి అధునాతన రక్షణ ఆయుధాలను కొనడానికి రెడీ అవుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మన ‘బ్రహ్మోస్’ మిస్సైళ్లతో పాటు.. శత్రువుల డ్రోన్లను వేటాడే ‘ఆకాశ్‌తీర్’ రక్షణ వ్యవస్థను కూడా సొంతం చేసుకోవాలని యూఏఈ ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన వ్యాపార చర్చలు ఇరు దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్నాయి.

మధ్యప్రాచ్యంలో మారుతున్న భద్రతా సమీకరణాలు.. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా యూఏఈ తన రక్షణ సామర్థ్యాలను పునర్వ్యవస్థీకరించుకోవాలని భావిస్తోంది. వైమానిక దాడులు, డ్రోన్లు, క్షిపణి ముప్పుల నుండి కీలక ప్రాంతాలను రక్షించుకోవడంతో పాటు.. చమురు ఎగుమతులకు మార్గమైన హార్ముజ్ జలసంధి భద్రతను బలోపేతం చేయడం యూఏఈ ప్రాధాన్యతగా మారింది. దీనికోసం రక్షణ వనరుల కొనుగోలులో కేవలం ఒక్క దేశంపైనే ఆధారపడకుండా.. భారత్ వంటి మైత్రి దేశాలతో భాగస్వామ్యం వైపు మొగ్గు చూపుతోంది.

భారత్, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను భూమి, సముద్రం, వైమానిక మార్గాల ద్వారా శత్రువులపైకి అత్యంత వేగంగా ప్రయోగించవచ్చు. రష్యా దేశంతో యూఏఈకి ఉన్న సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాల కారణంగా ఈ క్షిపణుల ఎగుమతి ప్రక్రియకు ఎలాంటి సాంకేతిక అవరోధాలు ఎదురుకావని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ‘ఆకాశ్‌తీర్’ వ్యవస్థ శత్రు విమానాలు, డ్రోన్ల ఉనికిని యుద్ధరంగంలో వేగంగా పసిగట్టి.. తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అమెరికాకు చెందిన పేట్రియాట్, థాడ్ వంటి రక్షణ వ్యవస్థలను కలిగి ఉన్న యూఏఈకి, భారత్ ‘ఆకాశ్‌తీర్’ సాంకేతికత మరింత రక్షణ కవచంలా ఉపయోగపడనుంది. గతంలో ఫిలిప్పీన్స్ దేశం భారత్ నుండి బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయగా.. ఇండోనేషియా, వియత్నాం, థాయిలాండ్ తదితర దేశాలు కూడా వీటి పట్ల తీవ్ర ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ రక్షణ ఒప్పందం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే.. గల్ఫ్ దేశాలలో భారతీయ రక్షణ సాంకేతికతకు మరింత గుర్తింపు లభిస్తుంది.