
అమెరికాలో ఉన్నత చదువులు చదవాలని ఆశపడే అంతర్జాతీయ విద్యార్థులకు బిగ్ షాక్ తగిలింది. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ఇక అమెరికా వెళ్లాలంటే కష్టంగా మారనుంది. విదేశీ విద్యార్థుల వీసాలకు ఇకపై నిర్దిష్ట గడువు తేదీని విధించే కొత్త ప్రతిపాదనకు వైట్‌హౌస్ ఆమోదం తెలిపింది. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధన త్వరలోనే అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ రూల్ ప్రకారం విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి ఇకపై గరిష్టంగా నాలుగేళ్లు మాత్రమే వీసా గడువు ఇవ్వనున్నారు.
ఇప్పటివరకు అమెరికాలో ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ అనే పాత పద్ధతి అమలులో ఉండేది. దీనివల్ల విద్యార్థులు తాము ఎంచుకున్న కోర్సు పూర్తి చేసేంత వరకు ఎన్ని ఏళ్లయిన ఉండవచ్చు. ప్రత్యేకంగా వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే అమెరికాలో ఉండే అవకాశం ఉంది. ఒక యూనివర్సిటీ నుండి ఇంకో దానికి మారాలన్నా, ఉన్నత చదువులకు వెళ్లాలన్నా, చదువు పూర్తి అయ్యాక ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయాలన్నా ఈ పాత పద్ధతి విద్యార్థులకు ఎంతో సులభంగా ఉండేది. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్ వల్ల విద్యార్థులకు ఇకపై కష్టంగా మారనుంది.
ఈ కొత్త నిర్ణయం వల్ల పీహెచ్డీ, మెడికల్, రీసెర్చ్ వంటి దీర్ఘకాలిక కోర్సులు చేసే భారతీయ విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడనున్నారు. ఈ కోర్సులు పూర్తి కావడానికి సాధారణంగా ఐదు నుండి ఏడేళ్ల సమయం పడుతుంది. తాజా నిబంధనల ప్రకారం నాలుగేళ్ల గడువు ముగిసిన తర్వాత వారు అమెరికాలో కొనసాగాలంటే ‘యూఎస్సీఐఎస్’ అధికారులకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదనపు పత్రాలు సమర్పించడం, ఫీజులు చెల్లించడం, బయోమెట్రిక్స్ ఇవ్వడం వంటి ప్రక్రియలు ఉంటాయి.
అమెరికాలో చదువుల పేరుతో వచ్చి చట్టవిరుద్ధంగా ఉండిపోతున్న వారిని నియంత్రించడానికే ప్రభుత్వం ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల నిజాయితీగా చదువుకునే విద్యార్థులపై పేపర్‌వర్క్ భారం, మానసిక ఆందోళన విపరీతంగా పెరుగుతాయి. దీనికి తోడు చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగం వెతుక్కోవడానికి ఇచ్చే గ్రేస్ పీరియడ్‌ను కూడా 60 రోజుల నుండి 30 రోజులకు తగ్గించాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది.









