Kamareddy Congress Dispute : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర సంచలనం సృష్టించిన కామారెడ్డి నియోజకవర్గ అంతర్గత వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ ఇందుప్రియ దంపతుల మధ్య నడుస్తున్న రాజకీయం గాంధీ భవన్‌కు చేరింది. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమక్షంలో ఇరు వర్గాల నేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపి, పరస్పర అవగాహనతో రాజీ పడటంతో ఈ వివాదం ముగింపు దశకు చేరుకుంది.

ఈ వివాదానికి ప్రధాన కారణమైన షబ్బీర్ అలీ ఆడియో కాల్ వ్యవహారంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సమక్షంలో ముఖాముఖి విచారణ జరిగింది. కమిటీ నుంచి నోటీసులు అందుకున్న షబ్బీర్ అలీ ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌కు హాజరయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో టేపులతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ వాయిస్ తనది కాదని ఆయన కమిటీకి స్పష్టం చేశారు. రాజకీయంగా తన ప్రతిష్టను దెబ్బతీయడానికే ప్రత్యర్థులు కుట్రపూరితంగా ఈ ఆడియోను సృష్టించారని ఆయన వివరణ ఇచ్చారు.

మరోవైపు, షబ్బీర్ అలీ తమపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఇందుప్రియ, ఆమె భర్త చంద్రశేఖర్ రెడ్డి సైతం క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. తాము సేకరించిన డిజిటల్ ఆధారాలను వారు కమిటీకి సమర్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో, ఇలాంటి అంతర్గత విభేదాలు బహిర్గతమవడం వల్ల ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతోందని, దీనివల్ల పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతోందని హైకమాండ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇరు వర్గాల వెర్షన్లను విన్న క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఇరు పక్షాల నేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పార్టీలోని అంతర్గత సమస్యల కోసం నాయకులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం, బహిరంగంగా విమర్శలు చేసుకోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకురావాలే తప్ప రచ్చకెక్కవద్దని గట్టిగా సూచించారు.

క్రమశిక్షణ కమిటీ చేసిన సూచనలు, సీనియర్ల జోక్యంతో కామారెడ్డి కాంగ్రెస్ పంచాయితీ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. షబ్బీర్ అలీ, చంద్రశేఖర్‌రెడ్డి పరస్పరం చేతులు కలిపి, వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేసేందుకు అంగీకరించారు. గతంలో జరిగిన సంఘటనలను మర్చిపోయి, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కట్టుబడి ఉంటామని ఇరు నేతలు ఉమ్మడిగా ప్రకటించారు.

ఈ రాజీ ఫార్ములాతో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపిన కామారెడ్డి కాంగ్రెస్ వివాదానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. కీలక నేతలు ఇద్దరూ ఒకే తాటిపైకి రావడంతో కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. అయితే, షబ్బీర్ అలీ ఆడియో టేపుల వ్యవహారంపై సాంకేతిక అంశాలను, తదుపరి చర్యలను రాబోయే కమిటీ సమావేశాల్లో మరింత సమగ్రంగా చర్చిస్తామని మల్లు రవి మీడియాకు వెల్లడించారు.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.