Saturday, June 13, 21:29
27.8 C
Hyderabad

Shabbir Ali : బిగ్ షాక్.. షబ్బీర్ అలీకి AICC షోకాజ్ నోటీసులు!

Shabbir Ali
Shabbir Ali

తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఉద్దేశించినట్లుగా చెబుతున్న ఒక వివాదాస్పద ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధిష్టానం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే ఏఐసీసీ క్రమశిక్షణా కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను ఉద్దేశించి, అలాగే పార్టీలోని మహిళా నేతలను కించపరిచేలా మాట్లాడినట్లు ఉన్న ఆడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ కావడంతో కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీకి ఏఐసీసీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు పంపడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

ఇటీవల బయటకు వచ్చిన ఒక ఫోన్ కాల్ ఆడియోలో… పార్టీ ముఖ్యులు, అధిష్టాన పెద్దలు డబ్బులు ఇచ్చేవాళ్లకు, పండబెట్టే వాళ్లకు అమ్ముడుపోతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు వినిపించాయి. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ లక్ష్యంగా ఈ ఆరోపణలు సాగడం, దాంతో పాటు మహిళా ప్రజాప్రతినిధులను తక్కువ చేసి మాట్లాడటం పార్టీ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపింది.

ఏఐసీసీ పెద్దలు తీవ్ర అసంతృప్తి

పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, సొంత పార్టీ నేతలపైనే బహిరంగంగా ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై ఏఐసీసీ పెద్దలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం గట్టిగా స్పందిస్తూ.. వెంటనే వివరణ ఇవ్వాలంటూ షబ్బీర్ అలీకి హుకుం జారీ చేసింది.

ఈ ఆడియో లీక్ వ్యవహారం వెనుక కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాలే ప్రధాన కారణమనే చర్చ నడుస్తోంది. షబ్బీర్ అలీ వర్గానికి, స్థానిక మరో ముఖ్య నేత చంద్రశేఖర్ రెడ్డి వర్గానికి మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు సాగుతోంది. మరోవైపు, ఈ ఆడియో లీక్ నేపథ్యంలో తమపై తప్పుడు ప్రచారం చేస్తూ, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటూ కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేయడం స్థానికంగా మరిన్ని రాజకీయ మలుపులకు దారితీసింది.

ప్రభుత్వ సలహాదారు హోదాలో ఉన్న సీనియర్ నేతపై హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? దీనికి షబ్బీర్ అలీ ఇచ్చే వివరణ ఎలా ఉండబోతోంది? అనే అంశాలపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.