ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఈ కేసు విచారణ కీలక దశకు చేరుకుందని, త్వరలోనే కొన్ని ఊహించని పరిణామాలు వెలుగులోకి వస్తాయన్నారు. తన ఫోన్‌ను ఎవరైనా ట్యాప్ చేసినా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, తన ఫోన్‌లో ఏం విన్నా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్‌పై మాత్రం తనకు ఎలాంటి సమాచారం లేదని, ఆ అంశంపై తాను మాట్లాడబోనని సీఎం రేవంత్ చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Also Read : TG TET 2027 నోటిఫికేషన్ రిలీజ్.. షెడ్యూల్ ఇదే

మరోవైపు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌పై కూడా సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అంతర్జాతీయ పెట్టుబడులకు ఎంతో అనుకూలమైన ప్రాంతమని తెలిపారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, అనుకూల వ్యాపార వాతావరణం, పెట్టుబడి అవకాశాలను ప్రపంచ దేశాలకు వివరించేందుకే ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థలకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోందని వెల్లడించారు. గ్లోబల్ సమ్మిట్‌కు ముందు భారత్ సమ్మిట్ నిర్వహించామని, ఈ కార్యక్రమానికి సుమారు 70 దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారని వివరించారు.

భారత్ సమ్మిట్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగిస్తారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాహుల్ పర్యటనపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీకి కేబినెట్ హోదా ఉందని గుర్తుచేశారు. అలాంటి నాయకుడిని అవమానించడం ప్రజాస్వామ్య విరుద్ధమని వ్యాఖ్యానించారు. చర్చలు, సంప్రదింపులే ప్రజాస్వామ్యానికి బలమని పేర్కొన్న సీఎం.. రాహుల్ గాంధీ విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం సరికాదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేసినా సమర్థిస్తూ, రాహుల్ గాంధీ ఏదైనా చేస్తే తప్పుపట్టడం ఎందుకని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ భవిష్యత్తులో ప్రధానమంత్రి అవుతారనే భయంతోనే బీజేపీ ఆయనను లక్ష్యంగా చేసుకుంటోందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. రాజకీయ విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలతో దేశానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని, దేశ అభివృద్ధికి ఉపయోగపడే అంశాలపై చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు.

Also Read : తెలంగాణ, ఏపీల్లో వైద్య విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. వేలల్లో పెరిగిన సీట్లు.. ఎంతంటే..?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.