NEET PG Seats Increased

నీట్ పీజీ (NEET PG) ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న MBBS వైద్యులకు జాతీయ వైద్య కమిషన్ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా పీజీ వైద్య సీట్లను భారీగా పెంచింది. గతంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, డీమ్డ్ విభాగాల్లో కలిపి మొత్తం 58,466 పీజీ సీట్లు ఉండేవి. అయితే ఈ విద్యా సంవత్సరానికి ఆ సంఖ్య 68,305కు చేరింది. అంటే మొత్తం 9,839 సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి.

దేశవ్యాప్తంగా పెరిగిన సీట్లు

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 30,033 నుంచి 34,473కి చేరాయి. అంటే 4,440 సీట్లు పెరిగాయి.

ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 20,923 నుంచి 24,732కి చేరాయి. అంటే 3,809 సీట్లు పెరిగాయి.

డీమ్డ్ వర్సిటీల్లో 7,510 నుంచి 9,100కి చేరాయి. అంటే 1,590 సీట్లు పెరిగాయి.

తెలుగు రాష్ట్రాలలో పీజీ సీట్ల వివరాలు

తెలంగాణ:

రాష్ట్రంలో పీజీ సీట్ల సంఖ్య గత సంవత్సరం 3,721 ఉండగా.. ఇప్పుడు అది 4,417కు పెరిగింది. అంటే మొత్తం 696 సీట్లు పెరిగాయన్నమాట.

అందులో ప్రభుత్వ కాలేజీల్లో సీట్ల సంఖ్య 1,469 నుంచి 1,838కి చేరాయి. దీనిబట్టి 369 సీట్లు పెరిగాయి.

అలాగే ప్రైవేటు కాలేజీల్లో 1,956 నుంచి 2,229కి చేరాయి. అంటే 273 సీట్లు అదనంగా పెరిగాయన్నమాట.

డీమ్డ్ వర్సిటీల్లో 296గా ఉన్న సీట్లు 350కి పెరిగాయి. అంటే 54 సీట్లు పెరిగాయన్నమాట.

గతంలో కేవలం 10 ప్రభుత్వ కాలేజీల్లోనే పీజీ కోర్సులు ఉండేవి. అయితే ఇప్పుడు మరో 13 కాలేజీలకు విస్తరించారు. అందులో మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, కామారెడ్డి, వనపర్తి, మంచిర్యాల, ఖమ్మం, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, నర్సంపేట, జనగాం, నిర్మల్, సంగారెడ్డి కాలేజీల్లో తొలిసారిగా పీజీ సీట్లను కేటాయించనున్నారు.

ఆంధ్రప్రదేశ్:

ఏపీలో పీజీ సీట్ల సంఖ్య 3,908 ఉండగా.. ఇప్పుడు 4,316కు పెరిగాయి. అంటే మొత్తం 408 సీట్లు అదనంగా చేరాయి.

అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,980 సీట్లు ఉండగా.. అవి ఇప్పుడు 2,143కి చేరాయి. అంటే 163 సీట్లు పెరిగాయన్నమాట.

అలాగే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 1,876 ఉండగా.. అవి ఇప్పుడు 2,121కి చేరాయి. అంటే 245 సీట్లు అదనంగా పెరిగాయన్నమాట.

ఇక డీమ్డ్ వర్సిటీల్లో ఎలాంటి మార్పు లేవు. గతంలో ఉన్న 52 సీట్లే యథాతథంగా ఉన్నాయి.

స్థానిక విద్యార్థులకు ప్రయోజనాలు

తెలంగాణలో స్థానిక రిజర్వేషన్ 85 శాతం అమలులో ఉండటం వల్ల.. పెరిగిన సీట్లతో స్థానిక విద్యార్థులకు క్లినికల్, నాన్-క్లినికల్ విభాగాల్లో నేరుగా 132 సీట్లు లభిస్తాయి.

విభాగాల వారీగా స్థానికులకు దక్కే సీట్లు:

అనస్థీషియా: 26

ఆర్థోపెడిక్స్: 16

పాథాలజీ: 14

గైనకాలజీ: 11

పీడియాట్రిక్స్: 11

రేడియాలజీ: 10

జనరల్ సర్జరీ: 9

జనరల్ మెడిసిన్: 9

ఆప్తాల్మాలజీ: 7

ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్: 6

ఈఎన్‌టీ (ENT): 5

డెర్మటాలజీ: 5

సైకియాట్రీ: 3

సీట్ల సంఖ్య భారీగా పెరగడంతో కటాఫ్ ర్యాంకుల్లో కీలక మార్పులు వస్తాయని.. గతంలో కంటే ఎక్కువ మంది స్థానిక విద్యార్థులకు మంచి క్లినికల్ విభాగాల్లో సీట్లు పొందే అవకాశం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.