nagarkurnool irrigation-engineer

ఎకరాల కొద్దీ భూములు.. ఖరీదైన విల్లా.. విలువైన ప్లాట్లు.. బంగారం.. కార్లు.. ఇలా ఇరిగేషన్‌ శాఖలో పనిచేస్తున్న ఓ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌కు సంబంధించిన ఆస్తుల వివరాలు ఏసీబీ సోదాల్లో బయటపడ్డాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పనిచేస్తున్న రాగిడి సత్యనారాయణ (44) ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఇవాళ (గురువారం) ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఒకేసారి 10 బృందాలతో ఆయన ఇల్లు, కార్యాలయంతో పాటు ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో గుర్తించిన ఆస్తుల ప్రభుత్వ విలువ సుమారు రూ.7 కోట్లు కాగా.. బయట మార్కెట్లో రూ. 100 కోట్ల వరకు ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. దీంతో ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఇరిగేషన్‌ అండ్‌ క్యాడ్‌ శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రాగిడి సత్యనారాయణపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు కావడంతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని బైరామల్‌గూడ మాధవరం సెరెనిటీ గేటెడ్‌ కమ్యూనిటీలో ఉన్న ఆయన నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వనపర్తి జిల్లాలో 25 ఎకరాల వ్యవసాయ భూమి, ఒక ఫామ్‌ హౌస్‌, కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న 9 ఓపెన్‌ ప్లాట్లను గుర్తించారు. తుక్కుగూడలో ఒక విల్లా, కర్మన్‌ఘాట్‌లో త్రీ బీహెచ్‌కే ఫ్లాట్‌, ఎల్బీనగర్‌ రాక్‌టౌన్‌లో టూ బీహెచ్‌కే ప్లాట్‌ ఉన్నట్లు గుర్తించారు. స్థిరాస్తులతో పాటు 50 తులాల బంగారం, మూడు కార్లు, ఒక బైకు ఉన్నట్లుగా గుర్తించారు. వీటితో పాటు రూ.20 లక్షల పెట్టుబడులు, ఎల్‌ఐసీ, బ్యాంకులకు సంబంధించిన పాలసీల వివరాలు కూడా తనిఖీల్లో బయటపడ్డాయి.

మార్కెట్‌ ధర పది రెట్లు ఎక్కువ!

ఏసీబీ అధికారులు గుర్తించిన ఆస్తుల ప్రభుత్వ మార్కెట్‌ విలువ సుమారు రూ.7 కోట్లుగా ఉంది. అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.100 కోట్ల వరకు ఉండొచ్చని ఏసీబీ అధికారుల అంచనా వేస్తున్నారు. సోదాల్లో లభించిన ఆస్తుల పత్రాలు, బ్యాంకు వివరాలు, పెట్టుబడులకు సంబంధించిన రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఆస్తులను ఎప్పుడు కొనుగోలు చేశారు? వాటికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తులకు సంబంధించిన వివరాలేంటి? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత నిందితుడిని రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ చలపతి వెల్లడించారు. ఇంకా తొమ్మిది ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయని, సోదాలు పూర్తయిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.