
రైతులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. 2026-27 రబీ సీజన్‌కు సంబంధించి ఫాస్ఫేటిక్, పొటాషిక్ ఎరువులపై న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ (NBS) రేట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2026 అక్టోబర్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు అమల్లో ఉండే ఈ స్కీమ్ కోసం సుమారు రూ.62,370 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎరువులు, ముడిసరుకుల రేట్లకు అనుగుణంగా సబ్సిడీని ఖరారు చేయడంతో అన్నదాతలకు తక్కువ ధరకే ఎరువులు లభించి, సాగు ఖర్చులు గణనీయంగా తగ్గనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ (CCEA) మీటింగ్‌లో మొత్తం రూ.77,101 కోట్లకు పైగా విలువైన పలు డెవలప్మెంట్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Also Read : పెండింగ్ కేసుల కోసం కేంద్రం ప్లాన్.. 3 రాష్ట్రాల్లో ‘ఈవెనింగ్ కోర్టులు’
కేబినెట్ తీసుకున్న ప్రధాన నిర్ణయాలు:
యుగే యుగీన్ భారత్ మ్యూజియం: ఢిల్లీలోని చారిత్రక నార్త్, సౌత్ బ్లాక్ భవనాల్లో రూ.3,230 కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియాన్ని అభివృద్ధి చేయనున్నారు. 1.78 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 18 లక్షలకు పైగా పురాతన వస్తువులతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. భారతీయ సంస్కృతి, సైన్స్, ఆర్కిటెక్చర్‌ను ప్రతిబింబించేలా మోడ్రన్ టెక్నాలజీతో ఏర్పాటవుతున్న ఈ మ్యూజియంలో తొలి గ్యాలరీని 2027 ద్వితీయార్థంలో పబ్లిక్ కోసం ఓపెన్ చేయనున్నారు.
నోయిడా మెట్రో విస్తరణ: నోయిడా సెక్టార్-51 నుంచి గ్రేటర్ నోయిడా సెక్టార్-4 వరకు 8.5 కిలోమీటర్ల మేర ఆక్వా లైన్ మెట్రో విస్తరణకు రూ.2,390 కోట్లు కేటాయించారు. ఈ రూట్లో కొత్తగా 5 మెట్రో స్టేషన్లు రానుండటంతో వేలాది మంది డైలీ ప్యాసింజర్లకు ట్రావెల్ ఈజీ కానుంది.
క్రెడిట్ గ్యారెంటీ ఫండ్స్: MSME రంగాన్ని బలోపేతం చేసేందుకు మైక్రో యూనిట్లకు రూ.5,000 కోట్లు, స్టాండ్ అప్ ఇండియా స్కీమ్ కోసం రూ.4,111 కోట్ల క్రెడిట్ గ్యారెంటీ ఫండ్స్ మంజూరు చేశారు.
అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కల్చర్, బిజినెస్ రంగాలకు సమాన ప్రాధాన్యమిస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాలు దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు ఆర్థిక ప్రగతికి ఊతమివ్వనున్నాయి.
Also Read : ‘అందుకే ప్రధాని పదవి వద్దనుకున్నా’: ఆత్మకథలో సోనియా గాంధీ సంచలనం









