రష్యాలో ఒక్కసారిగా రేడియేషన్, అణు ప్రమాద హెచ్చరికలు మోగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఖేర్సన్ రీజియన్‌లో కాల్పుల విరమణ ముగిసిన కొన్ని గంటల్లోనే రష్యా, ఉక్రెయిన్ దేశాల అలర్ట్ సిస్టమ్స్‌పై భారీ సైబర్ అటాక్ జరిగింది. రష్యా ఎమర్జెన్సీ మినిస్ట్రీకి చెందిన మొబైల్ యాప్‌లోకి చొరబడిన హ్యాకర్లు.. రేడియేషన్, కెమికల్, న్యూక్లియర్ దాడులు జరుగుతున్నాయంటూ ఫేక్ వార్నింగ్స్ పంపడంతో ప్రజలు షాక్‌కు గురయ్యారు.

Also Read : స్కూళ్లలో టర్బన్లు, నిఖాబ్‌లపై నిషేధం: ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర దుమారం

డ్రోన్ దాడుల నుంచి ప్రజలను అప్రమత్తం చేసే ఈ అఫీషియల్ యాప్‌పై సైబర్ దాడి జరిగిందని, వచ్చిన అలర్ట్స్ అన్నీ తప్పుడు సమాచారమని రష్యా అధికారులు స్పష్టం చేశారు. ఈ దాడి వెనుక ఉక్రెయిన్ హస్తం ఉండవచ్చని రష్యా అనుమానిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌లోని ఎయిర్ అలర్ట్ యాప్, లౌడ్ స్పీకర్ల సిస్టమ్‌ను కూడా హ్యాకర్లు టార్గెట్ చేసి ఫేక్ వార్నింగ్స్ ఇచ్చారు. అయితే ఎలాంటి ముప్పు లేదని, నేషనల్ అలర్ట్ సిస్టమ్ తిరిగి సాధారణ స్థితికి వచ్చిందని ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ వెల్లడించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

గతంలో కూడా ఇలాంటి తప్పుడు హెచ్చరికలు పెను విపత్తులకు దారితీయబోయాయి. 1983 కోల్డ్ వార్ సమయంలో సోవియట్ యూనియన్ ముందస్తు హెచ్చరికల వ్యవస్థలో అమెరికా క్షిపణులు ప్రయోగించినట్లు తప్పుడు అలర్ట్ వచ్చింది. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఆఫీసర్ స్టానిస్లావ్ పెట్రోవ్ దాన్ని సాంకేతిక లోపంగా గుర్తించడంతో పెను అణు యుద్ధం తప్పింది. అంతకుముందు అమెరికా కమాండ్ సెంటర్ కంప్యూటర్లలో తలెత్తిన లోపం వల్ల రష్యా అటాక్ చేస్తోందని భావించి అమెరికా యుద్ధ విమానాలను సైతం రంగంలోకి దించింది, అనంతరం పొరపాటును గుర్తించి వెనక్కి తగ్గింది.

ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ దాడుల వల్ల వచ్చే ఇలాంటి ఫేక్ రేడియేషన్ వార్నింగ్స్ ఎంతటి విధ్వంసకర గందరగోళానికి దారితీస్తాయో తాజా ఘటన మరోసారి నిరూపించింది.

Also Read : అమెరికా ల్యాబ్‌లో బయటపడ్డ సీక్రెట్ మ్యాజిక్.. పాదరసం నుంచి బంగారం.. ఎలాగంటే?