
పహల్గాం టెర్రర్ ఎటాక్, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో పాకిస్థాన్‌తో భారత్ దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంది. ఇందులో భాగంగా దాయాది దేశంతో డైరెక్ట్ ట్రేడ్‌ను భారత్ నిలిపివేయగా, దీనికి ప్రతిస్పందనగా పాక్ కూడా భారత ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధించింది. అయితే, అధికారికంగా ట్రేడ్ బ్యాన్ అమల్లో ఉన్నప్పటికీ, పాకిస్థాన్ మార్కెట్లో భారతీయ వస్తువులకు ఉన్న డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Also Read : యూట్యూబ్‌కి ఇన్‌స్టా బిగ్ షాక్.. ఇకపై 90 నిమిషాల లాంగ్ వీడియోలు.. ఓటీటీలా మారనున్న సోషల్ మీడియా!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరు క్వార్టర్లో ఏకంగా రూ.586 కోట్ల విలువైన భారత ఉత్పత్తులు పాకిస్థాన్‌కు చేరడం విశేషం. డైరెక్ట్ రూట్ మూసుకుపోవడంతో, వ్యాపారులు యూఏఈ (UAE), సింగపూర్ వంటి థర్డ్ కంట్రీస్ (మూడో దేశాల) మీదుగా మన వస్తువులను పాక్ మార్కెట్లోకి రీ-రూట్ చేస్తున్నారని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు.
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ ‘డాన్’ (Dawn) పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం.. 2026-27 జులై-సెప్టెంబరు త్రైమాసికంలో పాక్ సుమారు 61.74 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.586 కోట్లు) విలువైన భారత ఉత్పత్తులను ఇంపోర్ట్ చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం (2025-26) ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది ఏకంగా 69 శాతం పెరగడం గమనార్హం. గత ఏడాది ఇదే సమయంలో ఈ దిగుమతుల విలువ 36.55 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.346 కోట్లు) మాత్రమే ఉండేది.
అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ మూడు నెలల కాలంలో పాకిస్థాన్ నుంచి భారత్‌కు ఒక్క రూపాయి విలువైన ఎగుమతులు కూడా జరగలేదు. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నా, సరిహద్దుల వద్ద ఆంక్షలు ఉన్నా.. పాక్ ప్రజలకు నిత్యావసరాలు, ఇతర వస్తువుల కోసం భారత ఉత్పత్తులపైనే ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొందని ఈ నివేదిక తేటతెల్లం చేస్తోంది.
Also Read : అందుకు రాజీనామా తప్పు కాదు.. MLAల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు









