Supreme Court Raises Big Question on Reservation
Supreme Court Raises Big Question on Reservation

తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేల రాజీనామాలు, పార్టీ ఫిరాయింపుల వివాదంపై సుప్రీంకోర్టు అత్యంత కీలక తీర్పును వెలువరించింది. వేరే పార్టీలోకి వెళ్లాలనుకున్న నేతలు తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లడం రాజకీయ ప్రక్రియలో ఒక భాగమేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆరుగురు మాజీ ఎమ్మెల్యేల రాజీనామాలు, పార్టీ మార్పును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.

రాష్ట్రంలో ఎన్నికల అనంతరం AIADMK పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, అధికారంలో ఉన్న TVK పార్టీలో చేరారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అన్నాడీఎంకే నేతలు, పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలను ఐదేళ్లపాటు అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు కారణమయ్యే ఎమ్మెల్యేలు, ప్రభుత్వం ఆ ఎన్నికల నిర్వహణ కోసం చేసే ఖర్చుకు సమానమైన మొత్తాన్ని ముందే డిపాజిట్ చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

అయితే, మద్రాస్ హైకోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ.. ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించిన తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని సమర్థించింది. దీనిపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అత్యున్నత న్యాయస్థానం కూడా హైకోర్టు నిర్ణయాన్నే సమర్థించింది.

రాజీనామా, అనర్హత వేటు అనేవి వేర్వేరు రాజ్యాంగ ప్రక్రియలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సభ్యులపై అనర్హత పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, వారి రాజీనామాలను ఆమోదించే పూర్తి అధికారం స్పీకర్‌కు ఉంటుందని తేల్చి చెప్పింది. అదే సమయంలో, అనర్హత పిటిషన్ల విచారణను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని స్పీకర్‌ను ఆదేశించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ రూలింగ్‌తో పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించినట్లయింది.