ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు మారుతున్న కొద్దీ ప్రజల పెట్టుబడి విధానాల్లో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా డ్రాగన్ దేశం చైనాలో ప్రస్తుతం బంగారం కొనుగోళ్లకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన దృశ్యం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. చైనాలోని ప్రధాన నగరాల్లోని పసిడి మార్కెట్లు అచ్చం కూరగాయలు లేదా చేపలు అమ్ముకునే రద్దీ మార్కెట్లను తలపిస్తున్నాయి. ఏమాత్రం తీరిక లేకుండా ఉదయం నుంచే కిటకిటలాడుతున్న దుకాణాలు, పసిడి కోసం ఎగబడుతున్న జనాన్ని చూస్తుంటే అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

చైనాలో సాధారణంగా ప్రజలు స్టాక్ మార్కెట్లు లేదా రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. కానీ గడిచిన కొంతకాలంగా రియల్ రంగం కుదేలవడం, షేర్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొనడంతో ఇన్వెస్టర్ల చూపు సురక్షితమైన ఆస్తిగా భావించే బంగారం వైపు మళ్లింది. బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు తగ్గిపోవడం, భవిష్యత్తుపై నెలకొన్న ఆర్థిక భయాల కారణంగా సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరూ పసిడి కొనుగోళ్లకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో మార్కెట్లలో రద్దీ కనిపిస్తోంది.

Also Read : ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహు భవిషత్ తేల్చే 3 పాయింట్లు ఇవే!

ఈ రద్దీ కేవలం ఆభరణాల కొనుగోళ్లకే పరిమితం కాలేదు. డిజిటల్ గోల్డ్ కంటే భౌతికంగా బంగారు నాణేలు, బార్లు కొనుగోలు చేసేందుకే చైనా ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. తమ వద్ద ఉన్న నగదును సురక్షితంగా దాచుకోవడానికి పసిడి మాత్రమే సరైన మార్గమని భావిస్తున్న జనం, గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి మరీ బంగారం కొనుగోలు చేస్తున్నారు. దుకాణాల యజమానులు సైతం స్టాక్ సరిపోక తలలు పట్టుకుంటున్న పరిస్థితి అక్కడ నెలకొంది.

చైనా మార్కెట్‌లో పసిడి కోసం జరుగుతున్న ఈ భారీ ఎగవడ ప్రపంచ దేశాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నప్పటికీ.. చైనాలో మాత్రం డిమాండ్ ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు, ద్రవ్యోల్బణ భయాలు ఇటువంటి పరిణామాలకు ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా కూరగాయల మార్కెట్‌ను తలపించేలా చైనాలో సాగుతున్న ఈ గోల్డ్ షాపింగ్ ట్రెండ్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : స్క్రీన్ దాటి వచ్చే సువాసనలు.. డిజిటల్ ప్రపంచంలో సరికొత్త విప్లవం!