అర్జెంటీనాలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. కడుపునొప్పి అంటూ హాస్పిటల్‌కు వచ్చిన పదేళ్ల చిన్నారి 6 నెలల ప్రెగ్నెంట్ అని తేలడం కలకలం రేపింది. ఈ దారుణానికి ఒడిగట్టింది మరెవరో కాదు.. ఆమె సవతి తండ్రేనని తేలడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

శాంటియాగో డెల్ ఎస్టెరో ప్రావిన్స్‌లోని కొలోనియా డోరా ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డుకు తల్లి తన పదేళ్ల కూతురిని కడుపునొప్పి సమస్యతో తీసుకువచ్చింది. అయితే డాక్టర్లు పరీక్షించగా ఆ పాప గర్భం దాల్చినట్లు, అది కూడా చివరి దశకు చేరుకున్నట్లు నిర్ధారించారు. పీరియడ్స్ కూడా స్టార్ట్ కాని చిన్నారి గర్భవతి కావడంతో తల్లి షాక్‌కు గురైంది. విచారణలో తన సవతి తండ్రి జూలియో వివాస్ (33) తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆ బాలిక స్వయంగా వెల్లడించింది.

Also Read : హాస్టల్ రూముల్లో ‘యాంటీ సూసైడ్’ ఫ్యాన్లు: ఎలా పనిచేస్తుందంటే?

కేసు నమోదు చేసుకున్న ప్రాసిక్యూటర్ గిల్లెర్మో ఫారియాస్ ఆదేశాల మేరకు పోలీసులు ఎల్ బ్రాచో గ్రామీణ ప్రాంతంలో నిందితుడు వివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు కీలక సాక్ష్యాలు, స్టేట్‌మెంట్లు సేకరిస్తున్నారు.

నిందితుడిని ఇంటర్నెట్ ద్వారా తన కుమార్తె పరిచయం చేసుకున్నప్పుడే, అతడిని అతిగా నమ్మవద్దని తాను ముందే హెచ్చరించానని బాలిక నాయనమ్మ నార్మా గోమెజ్ స్థానిక మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. తన ఎనిమిదేళ్ల వయసులో ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ, మనవరాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. అటు స్కూల్‌లో సైలెంట్‌గా ఉంటూ హోంవర్క్ చేసుకునే ఆ చిన్నారి ప్రవర్తనలో ఎలాంటి తేడా గమనించలేకపోయామని టీచర్ లుక్రెసియా విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు డిజిటల్ ఆధారాలతో పూర్తి కేసును విచారిస్తున్నారు.

Also Read : భార్య కనిపించడం లేదని భర్త ఫిర్యాదు.. బిగ్ ట్విస్ట్ ఏంటంటే?