
Flights Charges : పండుగలు, రద్దీ సమయాల్లో ఎయిర్‌లైన్స్ సంస్థలు విమాన టికెట్ల ధరలను విచ్చలవిడిగా పెంచుతూ ప్రయాణికుల జేబులు గుల్ల చేయడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ ఇష్టారాజ్యంగా టికెట్ ఛార్జీలు పెంచడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది.
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఆర్.మహాదేవన్, జస్టిస్ అపరేశ్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. విమాన టికెట్ ధరల నియంత్రణకు రూపొందించిన కొత్త నిబంధనలకు పరిపాలనాపరమైన అప్రూవల్ లభించిందని ఆయన కోర్టుకు తెలిపారు. ‘భారతీయ వాయుయాన్ అధినియం-2024’ చట్టం కింద రూపొందించిన ఈ రూల్స్‌ను మరో రెండు వారాల్లో అధికారికంగా నోటిఫై చేస్తామని స్పష్టం చేశారు. ఈ వివరణను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, కేసు తదుపరి విచారణను నవంబర్ 16కు వాయిదా వేసింది. అప్పటిలోగా నోటిఫై చేసిన నిబంధనలను తమ ముందు ఉంచాలని కేంద్రాన్ని ఆదేశించింది.
Also Read : తినడంలో భారత్ రికార్డ్.. జపాన్ని వెనక్కి నెట్టిన ఇండియన్స్
గత విచారణలో ఎయిర్‌లైన్స్ సంస్థల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు పాటించకపోతే సర్వీసులను పూర్తిగా నిలిపివేసేందుకు సైతం వెనుకాడబోమని హెచ్చరించింది. ప్రభుత్వం టికెట్ ధరలపై కఠిన నిబంధనలు తీసుకొస్తుందన్న వార్తలతో స్టాక్ మార్కెట్లో ఎయిర్‌లైన్ షేర్లు నష్టపోయాయి. దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్ ‘ఇండిగో’ను నడిపే ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు మధ్యాహ్నం సమయానికి 1.99 శాతం క్షీణించి రూ. 4,683.20 వద్దకు చేరాయి.
ప్రస్తుతం దేశీయ విమానయాన రంగంలో ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఆకాశా ఎయిర్, స్పైస్‌జెట్ వంటి ప్రధాన సంస్థలు సేవలు అందిస్తున్నాయి. ఇటీవల విస్టారా, ఏఐఎక్స్ కనెక్ట్ విలీనం కావడంతో మార్కెట్లో ఎక్కువ వాటా టాటా గ్రూప్, ఇండిగో చేతుల్లోనే కేంద్రీకృతమైంది. ఇవి కాకుండా స్టార్ ఎయిర్, ఫ్లై91 వంటి రీజినల్ ఎయిర్‌లైన్స్, బ్లూడార్ట్ వంటి కార్గో సంస్థలు ఉన్నప్పటికీ, ప్రయాణికులకు మెరుగైన ప్రైసింగ్ లభించడం లేదు. కేంద్రం తీసుకురానున్న ఈ సరికొత్త నిబంధనలతో సామాన్య ప్రయాణికులకు భారీ ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది.
Also Read : పాక్ నుంచి వచ్చిన 319 మందికి భారతీయ పౌరసత్వం









