Citizenship : పాకిస్థాన్‌లో అణచివేత, వివక్షకు గురై భారత్‌కు వలసవచ్చిన పాకిస్తానీలకు ఏళ్ల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. గుజరాత్‌లో తలదాచుకుంటున్న హిందూ శరణార్థుల మొత్తం 319 మందికి భారతీయ పౌరసత్వం లభించింది. రాజ్‌కోట్‌లోని స్వామి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో గుజరాత్ డిప్యూటీ సీఎం హర్ష్ సంఘ్వీ లబ్ధిదారులకు అధికారిక సిటిజెన్‌షిప్ సర్టిఫికేట్లు అందజేశారు.

ఈ వేడుకలో పౌరసత్వ పత్రాలు అందుకున్న శరణార్థులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వారి కళ్లలో ఆనందబాష్పాలు కనిపించాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. “నవ్వుకోండి, ఇకపై మీరందరూ అధికారికంగా భారతీయులే” అంటూ వారిని అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (CAA) వల్లే ఈ అద్భుతం సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు.

పాకిస్థాన్‌లోని థార్‌పార్కర్ వంటి ప్రాంతాల్లో హిందువులు, ముఖ్యంగా మహిళలు భద్రత లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రాణాలు రక్షించుకోవడానికి పేర్లు కూడా మార్చుకోవాల్సిన దుస్థితి ఉండేదని సంఘ్వీ గుర్తుచేశారు. ఇప్పుడు పౌరసత్వం లభించడంతో వారంతా తమ అసలు పేర్లతో, ఎవరికీ భయపడకుండా ఆత్మగౌరవంతో బతకవచ్చని పేర్కొన్నారు. పాకిస్థాన్ పాస్‌పోర్ట్ కంటే రాజ్‌కోట్ గర్బా ఉత్సవాల్లో పాల్గొనేందుకు లభించే పాసే ఎంతో విలువైందని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : సీజేపీ బిగ్ షాక్.. ఢిల్లీలో 163 సెక్షన్ అమలు

ప్రాంతాల వారీగా వివరాలు:

పౌరసత్వం దక్కిన 319 మందిలో అత్యధికంగా రాజ్‌కోట్ జిల్లాకు చెందినవారు 259 మంది ఉండగా, మోర్బీ నుంచి 53 మంది, కచ్ నుంచి 6 మంది, సురేంద్రనగర్ నుంచి ఒకరు ఉన్నారు.

Also Read : జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడేందుకే ఇదంతా చేస్తున్నావా.. మోదీపై అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు

కొత్త జీవితం వైపు అడుగులు:

భారత పౌరసత్వం లభించడం తమ జీవితంలో సరికొత్త అధ్యాయమని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఇకపై తమకు ఆధార్ కార్డు, ఓటరు ఐడీ లభిస్తాయని, రాబోయే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఆనందం వ్యక్తం చేశారు. బ్యాంకుల నుంచి రుణాలు పొంది సొంతిల్లు సమకూర్చుకునే అవకాశం రావడంతో తమ చిరకాల స్వప్నం నెరవేరిందని శరణార్థి కుటుంబాలు తెలిపాయి.