
India : ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు అదరగొట్టింది. మలేషియాపై 5-1 తేడాతో ఘన విజయం సాధించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆసియా క్రీడల్లో వరుసగా రెండోసారి గోల్డ్ మెడల్ సాధించిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అంతేకాదు.. ఈ విజయంతో 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించింది. గిఫు ప్రిఫెక్చురల్ గ్రీన్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ తొలి నుంచే దూకుడుగా ఆడింది. 12వ నిమిషంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను అద్భుతమైన డ్రాగ్ఫ్లిక్గా మలిచి భారత్‌కు తొలి గోల్ అందించాడు.
Also Read : రోహిత్ సెంచరీ మిస్.. కానీ సచిన్ రికార్డు బద్దలు!
అయితే రెండు నిమిషాలకే మలేషియా తిరిగి గోల్ కొట్టింది. షెల్‌లో సిల్వేరియస్ ఎడమ వైపు నుంచి వచ్చిన బంతిని అదుపులోకి తీసుకుని అద్భుతమైన హాఫ్ వాలీతో భారత గోల్‌కీపర్ సూరజ్ కర్కేరాను బోల్తా కొట్టించాడు. దీంతో తొలి క్వార్టర్ ముగిసే సమయానికి స్కోరు 1-1గా నిలిచింది.
రెండో క్వార్టర్లో భారత్ మరోసారి ఆధిక్యంలోకి వెళ్లింది. 23వ నిమిషంలో శిలానంద్ లక్రా తన స్టిక్వర్క్తో పెనాల్టీ కార్నర్ సంపాదించాడు. ఈ అవకాశాన్ని జుగ్రాజ్ సింగ్ సద్వినియోగం చేసుకున్నాడు. అతడు తక్కువ ఎత్తులో కొట్టిన డ్రాగ్‌ఫ్లిక్ నేరుగా గోల్ కావడంతో భారత్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. హాఫ్‌టైమ్ వరకు ఇదే స్కోరు కొనసాగింది.
మూడో క్వార్టర్లో భారత్ ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. 42వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ నుంచి మన్దీప్ సింగ్ కొట్టిన బంతి మలేషియా డిఫెండర్‌కు తగిలి గోల్‌లైన్ వద్దకు వెళ్లింది. దీంతో భారత్‌కు పెనాల్టీ స్ట్రోక్ లభించింది. హార్దిక్ సింగ్ ఎలాంటి పొరపాటు చేయకుండా బంతిని గోల్‌లోకి పంపి స్కోరును 3-1కు చేర్చాడు. 55వ నిమిషంలో భారత్ మరో గోల్ కొట్టి మ్యాచ్‌ను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది. కుడి వైపు నుంచి సర్కిల్‌లోకి దూసుకొచ్చిన ఫార్వర్డ్ అభిషేక్ కొట్టిన బంతి డిఫ్లెక్షన్ తర్వాత గోల్ ముందు పడింది. అక్కడే సిద్ధంగా ఉన్న శిలానంద్ లక్రా దాన్ని ట్యాప్ చేసి గోల్‌గా మలిచాడు. దీంతో భారత్ 4-1 ఆధిక్యంలోకి వెళ్లింది.
అంతటితో భారత్ ఆగలేదు. మరో నిమిషానికే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ తన రెండో గోల్ సాధించాడు. దీంతో భారత్ 5-1తో తిరుగులేని విజయం సాధించి ఆసియా క్రీడల పురుషుల హాకీలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత్ 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించింది. అంతేకాదు.. ఆసియా క్రీడల్లో వరుసగా రెండుసార్లు పురుషుల హాకీ స్వర్ణం సాధించడం భారత జట్టుకు ఇదే తొలిసారి.
మరోవైపు ఆసియా క్రీడల్లో భారత బృందం తమ ప్రయాణాన్ని 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలతో ముగించింది. మొత్తం 85 పతకాలతో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. భారత్, ఉజ్బెకిస్థాన్ రెండూ 21 స్వర్ణాలు సాధించినప్పటికీ.. భారత్ ఎక్కువ రజత పతకాలు గెలవడంతో ముందంజలో నిలిచింది.
Also Read : పాక్‌పై భారత్ ఘన విజయం.. స్వర్ణం సాధించిన టీమిండియా!









