సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని చాలా మందికి ఉంటుంది. కానీ.. సరిపడా డబ్బులు లేకపోవడంతో ఆ ఆలోచనను అక్కడితోనే పక్కన పెట్టేస్తుంటారు. పోనీ బ్యాంకు కెళ్లి లోన్ తీసుకుందామంటే.. ఆ కాగితాలు, ఈ పూచీకత్తులు అంటూ బ్యాంకర్లు తిప్పే తిప్పులకు సగం మందికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. పైగా ఏ ప్రభుత్వ పథకం కింద అప్లై చేస్తే లోన్ త్వరగా వస్తుందో.. అసలు మనకి ఏ స్కీమ్ వర్తిస్తుందో తెలియక సతమతమవుతుంటారు. కానీ.. ఇకపై ఆ టెన్షన్లు పడాల్సిన అవసరమే లేదు. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ ప్రభుత్వం ఒక డిజిటల్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఇంతకీ ఆ పోర్టల్ ఏంటంటే ‘myScheme’. ఈ సింగిల్ డిజిటల్ వేదికపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వందలాది సంక్షేమ పథకాలు, బిజినెస్ లోన్ స్కీమ్‌లు అందుబాటులో ఉంటాయి. సాధారణంగా ఒక వ్యాపార రుణం కావాలంటే వివిధ ప్రభుత్వ వెబ్‌సైట్లు వెతకడం, ఆఫీసుల చుట్టూ తిరగడం పెద్ద సమస్య. కానీ ఈ డిజిటల్ పోర్టల్ ద్వారా ప్రజలు, వ్యాపారవేత్తలు తమ వ్యక్తిగత, వ్యాపార వివరాలను నమోదు చేయడం ద్వారా తమకు ఏ పథకాలు వర్తిస్తాయో క్షణాల్లో ఒక ‘ఎలిజిబిలిటీ రిపోర్ట్’ రూపంలో తెలుసుకోవచ్చు.

Also Read : బంగ్లాదేశ్‌ను ముందుపెట్టి భారత్‌పై పాక్ కొత్త కుట్ర.. ఏం చేస్తుందంటే?

ఈ పోర్టల్‌లో ప్రధాన మంత్రి ముద్రా యోజన, PMEGP, MSME లోన్లు, స్టాండప్ ఇండియా వంటి ప్రముఖ బిజినెస్ లోన్ పథకాల సమాచారం ఉంటుంది. మీ వయస్సు, ఆదాయం, వ్యాపార స్వభావం, కావాల్సిన రుణ పరిమాణం వంటి ప్రాథమిక వివరాలను నమోదు చేస్తే చాలు.. మీరు ఏ రుణ పథకానికి అర్హులు, అందులో లభించే సబ్సిడీ ఎంత, వడ్డీ రేటు ఎంత ఉంటుంది అనే విషయాలను పోర్టల్ స్పష్టంగా చూసి వివరాలను ఇస్తుంది. దీనివల్ల రిజెక్ట్ అయ్యే అవకాశాలు తగ్గి.. లోన్ త్వరగా అప్రూవ్ అయ్యే మార్గం సుగమమవుతుంది.

దీని ద్వారా దరఖాస్తు చేసుకునే విధానం కూడా ఈజీగా ఉంటుంది. పోర్టల్‌లో లాగిన్ అయి మిమ్మల్ని అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానమిస్తే మీ ప్రొఫైల్‌కు సరిపోయే బెస్ట్ స్కీమ్‌ల జాబితా స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. ఆ తర్వాత మీకు కావలసిన స్కీమ్‌ను ఎంచుకుని, అవసరమైన పత్రాలైన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, వ్యాపార ప్రాజెక్ట్ రిపోర్ట్, బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటి వివరాలను అప్‌లోడ్ చేసి నేరుగా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధిత బ్యాంకులు లేదా అధికారులకు సమాచారం వెళ్తుంది.

వ్యాపార రుణాలతో పాటు యువతకు, మహిళలకు, రైతులకు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి కూడా ఈ వేదిక ఎంతో ఉపయోగకరంగా మారింది. ఎలాంటి పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణాల వివరాలు, ప్రభుత్వాలు అందించే 15% నుంచి 35% వరకు ఉండే సబ్సిడీ ఆఫర్ల వివరాలు ఈ రిపోర్ట్ ద్వారా క్లియర్‌గా తెలుస్తాయి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా పారదర్శకంగా లోన్ అప్రూవల్ పొందే అవకాశం దీని ద్వారా లభిస్తుంది.

Also Read : చైనా చిత్తు.. భారత మహిళల హాకీ జట్టుకు ఏషియన్ గేమ్స్ గోల్డ్!