MLC Elections : తెలంగాణలో మరోసారి ఎన్నికల వాతావరణం చోటు చేసుకుంది. ఒకవైపు దానం నాగేందర్‌పై అనర్హతతో త్వరలో ఖైరతాబాద్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా, మరోవైపు త్వరలో ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌– రంగారెడ్డి– హైదరాబాద్‌‌ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉమ్మడి వరంగల్‌– ఖమ్మం– నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాల నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న వాణిదేవి, తీన్మార్‌ మల్లన్న (చింతపండు నవీన్‌కుమార్‌) ల పదవీకాలం ముగుస్తుండటంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించడం గమనార్హం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సామ రామ్మోహన్‌ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్‌ రెడ్డిలను తమ అభ్యర్థులను ప్రకటించింది.

తెలంగాణ శాసనమండలికి త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రానున్న అసెంబ్లీ ఎన్నికల పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ క్రమంలో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌– రంగారెడ్డి– హైదరాబాద్‌‌ పట్టభద్రుల నియోజకవర్గానికి సామ రామ్మోహన్‌ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించగా, ఉమ్మడి వరంగల్‌– ఖమ్మం– నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి రాంరెడ్డి సర్వోత్తమ్‌ రెడ్డిలను కాంగ్రెస్ అధిష్టానం ఈ మేరకు ఎంపిక చేసింది.

Also Read : ప్రభుత్వాసుపత్రిలో తల్లికి బెడ్​ కేటాయించని సిబ్బంది… వీల్​చైర్​తో నేరుగా ఎమ్మెల్యే ఇంటికి బాధితుడు

సామ రామ్మోహన్‌ రెడ్డి

ఉమ్మడి మహబూబ్‌నగర్‌– రంగారెడ్డి– హైదరాబాద్‌ స్థానానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన సామ రామ్మోహన్‌ రెడ్డిది రంగారెడ్డి జిల్లా. ఆయన ప్రస్తుతం టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్‌ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. పార్టీ ముఖ్య అధికార ప్రతినిధిగా సైతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రామ్మోహన్‌ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా, జాతీయ అధికార ప్రతినిధిగా పని చేశారు. అలాగే 2017లో కాంగ్రెస్ లీగల్‌ సెల్‌ ఉపాధ్యక్షుడిగా, 2019లో పార్టీ అధికార ప్రతినిధిగా కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీలను విమర్శించడంలో ముందుండే సామ రామ్మోహన్‌ రెడ్డి యువకుడు కావడంతో పాటు, పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించి ఆయనకు టికెట్‌ కేటాయించారు.

Also Read : ఎస్సార్‌నగర్ యువతి హత్య కేసులో సంచలన విషయాలు

రాంరెడ్డి సర్వోత్తమ్‌ రెడ్డి

ఇక ఉమ్మడి వరంగల్‌– ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల స్థానానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రాంరెడ్డి సర్వోత్తమ్‌ రెడ్డి సూర్యాపేట జిల్లాకు చెందినవారు. ఈయన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి కి కుమారుడు. సీనియర్ నేత అయిన దామోదర్‌రెడ్డి అడుగు జాడల్లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన యూత్‌ కాంగ్రెస్‌ రాజకీయాల్లో ఎంతో చురుగ్గా వ్యవహరించారు. సర్వోత్తమ్‌ రెడ్డి నల్లగొండ జిల్లాలో పార్టీ కోసం కృషి చేస్తున్నారని గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. ఏఐసీసీ సభ్యుడిగా కూడా ఉన్న ఆయన యూత్‌ కాంగ్రెస్‌లో అనేక హోదాల్లో పార్టీకి సేవలు అందించారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.