Bandi Sanjay :  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీశాయి. ఉత్తర, దక్షిణ భారతదేశాల రాజకీయాల గురించి మాట్లాడిన ఆయన.. రాముడు, శివుడిని కూడా ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ మీడియా కార్యక్రమంలో రేవంత్ రెడ్డి బీజేపీ నేతలు తరచూ జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తుంటారని అన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ నేతలు హర హర మహాదేవ్ అని ఎందుకు అనరని ప్రశ్నించారు.

తాము దక్షిణ భారతానికి చెందిన వారమని, ఉత్తర భారత రాజకీయ సంస్కృతి వేరుగా ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. మేం ద్రావిడులం.. వాళ్లు ఆర్యులు. మేం శివుడి భక్తులం.. వాళ్లు రాముడి భక్తులు అని వ్యాఖ్యానించారు.అంతేకాదు.. శివుడు పేదల దేవుడని, రాముడు ధనికుల దేవుడని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే రాముడిని, శివుడిని ఇద్దరినీ ప్రజలు దేవుళ్లుగా కొలుస్తారని కూడా చెప్పారు.

Also Read : రైతులు ఈ 3 పనులు పూర్తి చేయకుంటే…పీఎం కిసాన్‌ నిధులు లేనట్టే..

ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. రాముడు, శివుడి మధ్య కూడా రాజకీయ విభజన తీసుకురావడం సరికాదని అన్నారు. ప్రధాని మోదీ కాశీ విశ్వనాథ ఆలయానికి వెళ్లిన విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. అలాగే వేములవాడకు మోదీ వెళ్లిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. బీజేపీ నేతలు శివుడిని పూజించరనే రేవంత్ వ్యాఖ్యలకు ఇవి సమాధానమని ఆయన అన్నారు.

రేవంత్ రెడ్డి గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలను కూడా బండి సంజయ్ ప్రస్తావించారు. ఇప్పుడు రాముడు, శివుడిని ఉత్తర, దక్షిణ ప్రాంతాలుగా విడదీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో వేములవాడను దక్షిణ కాశీగా, భద్రాచలాన్ని దక్షిణ అయోధ్యగా పిలుస్తారని బండి సంజయ్ చెప్పారు. అందుకే రాముడు, శివుడిని ఉత్తర, దక్షిణ ప్రాంతాల పేరుతో విడదీయకూడదని అన్నారు.

మతం, ప్రాంతం పేరుతో ప్రజలను విడగొట్టేలా రాజకీయాలు చేయకూడదని బండి సంజయ్ అన్నారు. హిందూ సంప్రదాయాలను కూడా ప్రాంతాల పేరుతో విడదీయవద్దని రేవంత్ రెడ్డికి సూచించారు. ఇదే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని కూడా ప్రస్తావించారు. జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రభావం పడొచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

అలాగే ఓటర్ల జాబితా సవరణ కోసం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంశంపైనా రేవంత్ రెడ్డి మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలని ఆయన కోరారు.

Also Read : శంషాబాద్ దిశ ఘటన స్థలంలో దారుణం…మహిళపై క్యాబ్‌ డ్రైవర్‌ లైంగిక దాడి యత్నం

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.