
Donald Trump : అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో అమెరికా త్వరలోనే గెలుస్తుందని ఆయన అన్నారు. యుద్ధం ముగిసిన వెంటనే అమెరికాలో ద్రవ్యోల్బణం పూర్తిగా తగ్గిపోతుందని, పెట్రోల్ ధరలు కూడా భారీగా పడిపోతాయని ట్రంప్ పేర్కొన్నారు.
వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. యుద్ధాన్ని ముగించేందుకు మధ్యవర్తులతో అమెరికా అధికారులు మాట్లాడుతున్నారని చెప్పారు. అయితే ఆ చర్చల్లో ఏం మాట్లాడుకున్నారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. మనం గెలుస్తాం. ఏదో ఒక విధంగా విజయం సాధిస్తాం. ఇది చాలా త్వరగా ముగుస్తుంది అని ట్రంప్ అన్నారు. నవంబర్‌లో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌పై అమెరికా మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందా అని అడిగినప్పుడు.. అలాంటి అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు.
Also Read : అమెరికాతో తుది పోరుకు సిద్ధం… ఇరాన్ విదేశాంగ మంత్రి సంచలన ప్రకటన
యుద్ధం ముగిసిన వెంటనే అమెరికాలో ద్రవ్యోల్బణం పూర్తిగా తగ్గిపోతుందని ట్రంప్ అన్నారు. పెట్రోల్ ధరలు కూడా ఒక్కసారిగా భారీగా తగ్గుతాయని చెప్పారు. అయితే ప్రస్తుతం మాత్రం ఇరాన్ యుద్ధం కారణంగా చమురు సరఫరాపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో మంగళవారం కూడా అంతర్జాతీయ చమురు ధరలు పెరిగాయి. అమెరికా ఇరాన్‌పై సైనిక చర్యకు దిగడాన్ని కూడా ట్రంప్ సమర్థించుకున్నారు. ఈ యుద్ధం వల్ల ప్రపంచానికి పెద్ద ప్రమాదం తప్పిందని ఆయన అన్నారు. ఇరాన్‌పై చర్య తీసుకోకపోతే ఇజ్రాయెల్ తీవ్ర ప్రమాదంలో పడేదని, ఆ తర్వాత అమెరికా, యూరప్ వైపు కూడా క్షిపణులు, బాంబుల ముప్పు పెరిగేదని ట్రంప్ పేర్కొన్నారు.
మరోవైపు యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా, ఇరాన్ మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నాయి. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల అధికారులు వేర్వేరుగా చర్చలు జరిపారు. యుద్ధాన్ని ఆపడం, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే తుది ఒప్పందంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కూడా ఖతార్ మధ్యవర్తులతో చర్చలు జరపాల్సి ఉంది.
అయితే అమెరికాతో తదుపరి చర్చలు ఇంకా ఖరారు కాలేదని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఇదిలా ఉండగా.. ఇరాన్‌కు ఆంక్షల నుంచి కొంత ఉపశమనం ఇవ్వడంతో పాటు అక్కడ నిలిచిపోయిన నిధులను విడుదల చేసేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఇరాన్ నుంచి అణు అంశంలో కొన్ని హామీలు తీసుకుని ఈ నిర్ణయం తీసుకోబోతున్నారన్న వార్తలు నిజం కాదని ట్రంప్ స్పష్టం చేశారు. అలాంటి ప్రతిపాదనను తాను అసలు చేయలేదని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
Also Read : నేపాల్‌లో మరోసారి వరదల బీభత్సం.. ఆందోళనలో ప్రజలు









