
CM Revanth Reddy :మన దేశం గర్వించదగిన గొప్ప రాజనీతిజ్ఞుడు మన్మోహన్ సింగ్ అని, ఆయనకు భారతరత్న ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్లోని విప్రో సర్కిల్లో దివంగత మాజీ ప్రధాన మంత్రి, రాజనీతిజ్ఞుడు మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ… మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను, ఆయన తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలను రేవంత్ రెడ్డి కొనియాడారు. పీవీ నరసింహారావుతో కలిసి ఆయన చేపట్టిన సరళీకృత ఆర్థిక విధానాలు దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాయని గుర్తు చేశారు, నేడు భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి పునాది వేయడంలో వారి పాత్ర ఎనలేనిదని కొనియాడారు. దేశ జీడీపీలో ఐదు శాతం ఆదాయాన్ని సమకూర్చే అనేక సంస్థలు అన్నీ హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచే వస్తున్నాయని ఈ సందర్భంగా రేవంత్ వివరించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్ర గణనీయమైనదని సీఎం స్మరించుకున్నారు. స్వరాష్ట్ర ఆకాంక్షను నిజం చేస్తూ తెలంగాణ బిల్లుపై ఆయన చేసిన సంతకం సువర్ణాక్షరాలతో లిఖించదగినదని ఆయన పేర్కొన్నారు, విగ్రహం వద్ద ఆ సంతకాన్ని కూడా నిక్షిప్తం చేసినట్లు రేవంత్ రెడ్డి వివరించారు. జాతీయ స్థాయిలో నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంబినేషన్ దేశానికి స్వేచ్ఛను ఇస్తే.. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ కాంబినేషన్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు పేదలకు ఉపాధి హామీ పథకం, విద్యా హక్కు చట్టం, పకడ్బందీ పునరావాస చట్టాలను తెచ్చిందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కొనియాడారు.
మితభాషి ఆయిన మన్మోహన్ మౌనన్నే భాషగా మార్చుకుని దేశాభివృద్ధికి నిస్వార్థంగా సేవలందించిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్అన్నారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ‘భారతరత్న’ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన పేరు మీద ఒక స్మారక భవనం, విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. భారతరత్న సాధన కోసం కాంగ్రెస్ ఎంపీలు, అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో కలిసి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.









