YouTuber Gold Theft : లైక్‌లు, ఫాలోవర్స్‌ కోసం కొంతమంది యూట్యూబర్లు చేస్తున్న వీడియోలు వారికి లేని తలనొప్పులు తీసుకొస్తు న్నాయి. గతంలో కొంతమంది చేసిన హోమ్‌టూర్లు ఐటీ దాడులకు, చోరీలకు కారణం కాగా, తాజాగా ఓ యూట్యూబర్‌ చేసిన పనికి ఆమె ఇల్లు గుల్లయింది. తన ఇంట్లో ఉన్న డబ్బులు, బంగారం చూపిస్తూ వీడియో చేయడమే కాకుండా తన వద్ద ఉన్న సొమ్మునంతా ప్రదర్శించిన ఆమెకు దొంగలు గట్టి షాకిచ్చారు. ఆమె తన వీడియోలో పేర్కొన్న అంశాల ఆధారంగా సేకరించిన సమాచారంతో ఆమె ఇంటికి కన్నం వేసి రూ. కోటికి పైగా విలువైన నగదు, నగల దొంగిలించారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Also Read : ఇదే నా చివరి ప్రపంచ కప్…సంచలన ప్రకటన చేసిన కోహ్లీ..

నాగర్‌కోయిల్‌ సమీపంలోని తమత్తుకోణం ప్రాంతానికి చెందిన వ్యాపారి వినోద్‌కుమార్‌, ఆయన భార్య మధుమిత తమ పిల్లలతో కలిసి ఉంటున్నారు. కాగా, మధుమిత యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేస్తూ చాలామంది ఫాలోవర్స్‌ను కలిగి ఉంది. కాగా ఈ గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. అలా వెళ్లిన వారు రాత్రి తిరిగి వచ్చేసరికి ఇంటి వెనుక తలుపు తెరిచి ఉంది. అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా గదిలోని బీరువా పగలగొట్టి ఉండడాన్ని గమనించారు. అయితే అందులో ఉంచిన బంగారం, వజ్రాభరణాలు, నగదు మొత్తం మాయమైంది. జరిగిన విషయాన్ని వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Also Read : సెప్టెంబర్ 30న ఢిల్లీలో INDIA కూటమి భేటీ.. అజెండా ఇదే!

కాగా, దర్యాప్తులో భాగంగా విషయం తెలిసి పోలీసులు తలలు పట్టుకున్నారు. మధుమిత ట్యూబ్‌లో చేస్తున్న కథనాలలో భాగంగా గతంలో తన వద్ద ఉన్న బంగారు నగలు, నగదు గురించి వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇంట్లో పరుపుపై పెద్ద మొత్తంలో నోట్ల కట్టలను ప్రదర్శిస్తూ, ఇంట్లోని బంగారు ఆభరణాలను ధరించి నగలు, నగదు మొత్తం చూపిస్తూ వీడియోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాదు ప్రతిసారి తను బయటకు వెళ్లే సందర్భాల్లో తాము ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నామనే విషయాలను సైతం సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం గమనార్హం..కాగా, సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులు,వీడియోల ద్వారా ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న దొంగలు ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో్ పోలీసులు యూట్యూబర్లకు అలాంటి వీడియోలు చేయవద్దని సలహా ఇస్తు్న్నారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.