గతేడాది నమోదైన రూ.35 లక్షల ఆల్ టైమ్ రికార్డును తిరగరాస్తూ ఈ సారి 2026 వేలంలో బాలాపూర్ గణేష్ 21 కిలోల లడ్డూ రూ.39 లక్షల భారీ ధరకు వేలంలో అమ్ముడైంది. తీవ్ర ఉత్కంఠ నడుమ సాగిన ఈ పోటీలో సామ ప్రణీత్ రెడ్డి ఈ లడ్డూను దక్కించుకున్నారు. వేలం ప్రారంభం కాగానే పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, భక్తులు లడ్డూను దక్కించుకునేందుకు పోటాపోటీగా వేలం వేశారు.

Also Read : గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ గణేశుడు

ఒకరిని మించి మరొకరు డబ్బులు పెంచుకుంటూ పోవడంతో వేలం పాట హోరాహోరీగా సాగింది. చివరకు సామ ప్రణీత్ రెడ్డి రూ.39 లక్షలకు పాడుకుని లడ్డూను తన సొంతం చేసుకున్నారు. విఘ్నేశ్వరుడి లడ్డూను దక్కించుకోవడంపై ఆయన తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు.

1994లో కేవలం రూ.450తో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం పాట, మూడు దశాబ్దాల కాలంలో ముప్పై తొమ్మిది లక్షల రూపాయల స్థాయికి చేరుకోవడం విశేషం. ఈ లడ్డూను దక్కించుకుంటే సిరిసంపదలు, సకల శుభాలు కలుగుతాయని భక్తుల దృఢమైన నమ్మకం. లడ్డూ వేలం ప్రక్రియ విజయవంతంగా పూర్తి కావడంతో ఇప్పుడు శోభయాత్ర ప్రారంభించనున్నారు.

Also Read : రూ.450తో మొదలై రూ.35 లక్షలకు.. 31 ఏళ్ల బాలాపూర్ లడ్డూ వేలం హిస్టరీ ఇదిగో!