
China : చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటనకు బయల్దేరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో గురువారం కీలక సమావేశం జరగనుంది. దాదాపు 11 ఏళ్ల తర్వాత జిన్‌పింగ్ వైట్‌హౌస్‌కు వస్తుండటంతో ఈ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. జిన్‌పింగ్ తన భార్య పెంగ్ లియువాన్‌తో పాటు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో అమెరికాకు బయల్దేరారు.
Also Read : ఇరాన్‌లో ‘CODE 100’.. ట్రంప్ ఎమర్జెన్సీ రిటర్న్..
జిన్‌పింగ్ అమెరికాలోని జాయింట్ బేస్ ఆండ్రూస్కు చేరుకున్న తర్వాత ట్రంప్ స్వయంగా ఆయనకు స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత గురువారం వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు అధికారిక స్వాగత కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో సైనిక ప్రదర్శన కూడా ఉంటుంది. అనంతరం ట్రంప్, జిన్‌పింగ్ మధ్య ముఖాముఖి చర్చలు జరగనున్నాయి. రాత్రికి ట్రంప్.. జిన్‌పింగ్ గౌరవార్థం వైట్‌హౌస్‌లో ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. శుక్రవారం ఇరువురు నేతలు తమ భార్యలతో కలిసి వైట్‌హౌస్‌లో టీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత నేషనల్ ఆర్కైవ్స్‌ను సందర్శిస్తారు.
ఈ భేటీలో ప్రధానంగా అమెరికా–చైనా వాణిజ్యం, టారిఫ్‌లు, AI, తైవాన్, ఇరాన్, అరుదైన ఖనిజాలు వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్యంపై చాలాకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చైనా నుంచి వచ్చే వస్తువులపై అమెరికా విధిస్తున్న టారిఫ్‌లు, చైనా నుంచి కీలకమైన రేర్ ఎర్త్ ఖనిజాల ఎగుమతులపై నియంత్రణలు చర్చల్లో కీలకంగా మారే అవకాశం ఉంది.
ఇక వేగంగా అభివృద్ధి చెందుతున్న AI టెక్నాలజీపై రెండు దేశాల మధ్య పోటీ, భద్రతా సమస్యలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. తైవాన్ విషయంలో ఇరుదేశాల మధ్య ఉన్న విభేదాలు కూడా ముఖ్యమైన అంశంగా ఉండనున్నాయి. ప్రపంచంలోని రెండు పెద్ద ఆర్థిక శక్తులైన అమెరికా, చైనా అధ్యక్షుల భేటీ కావడంతో ఈ చర్చలపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.
Also Read : ఇక ఇరాన్ విమానాలు ఎగరవు… గ్లోబల్ షట్‌డౌన్ ప్రకటించిన అమెరికా









