
Ram Temple : అయోధ్య రామ మందిరంలో భక్తులు ఇచ్చిన విరాళాల చోరీకి సంబంధించిన కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. సీసీ కెమెరాల పరిశీలనలో 105 సార్లు విరాళాల చోరీ జరిగినట్లు గుర్తించామని సిట్ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ వివరాలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు ముందు ఉంచారు. ఈ కేసుపై దర్యాప్తు దాదాపు పూర్తయిందని తుషార్ మెహతా తెలిపారు. సెప్టెంబర్ 25లోపు ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని కోర్టుకు చెప్పారు. ఛార్జ్‌షీట్ వచ్చిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మేజిస్ట్రేట్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
కోర్టు విచారణలో సీసీటీవీ వీడియోలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాల గురించి కూడా వివరించారు. ఈ ఆధారాలను పరిశీలించి నిందితులను ఎలా గుర్తించారో సిట్ తన నివేదికలో వివరించింది. సుప్రీంకోర్టు ఈ వివరాలను తన రికార్డులోకి తీసుకుంది. విలువైన వస్తువులకు సంబంధించిన రసీదులు సాఫ్ట్‌వేర్ ద్వారా తయారు చేసి, వాటిని SBI లాకర్‌లో భద్రపరుస్తున్నట్లు కూడా సిట్ నివేదికలో పేర్కొన్నారు.
Also Read : AI చిన్న మిస్టెక్.. అమెరికా-చైనా మధ్య యుద్ధం!
కేసు విచారణ సమయంలో పిటిషనర్లు సిట్ నివేదిక కాపీని తమకు ఇవ్వాలని కోరారు. అయితే సుప్రీంకోర్టు అందుకు అంగీకరించలేదు. ఈ కేసును ప్రస్తుతం విచారిస్తున్న సెషన్స్ కోర్టు పరిధిలోనే ఉంచాలని భావిస్తున్నట్లు కోర్టు తెలిపింది. అవసరమైతే తదుపరి దర్యాప్తుపై ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు తాజా సమాచారం. వీరిపై భారతీయ న్యాయ సంహిత (BNS), అవినీతి నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత రామ మందిర ట్రస్ట్‌లోని విరాళాల నిర్వహణ, డబ్బు లెక్కింపు విధానంపై కూడా ప్రశ్నలు వచ్చాయి. గతంలో సిట్ ప్రాథమిక దర్యాప్తులో డబ్బు లెక్కించే సమయంలో సిబ్బంది నగదు దాచుకున్నట్లు సీసీటీవీ ఆధారాలు గుర్తించినట్లు వెల్లడైంది. భద్రతా నిబంధనలు సరిగా అమలు కాలేదన్న విషయాన్ని కూడా ఆ దర్యాప్తు పరిశీలించింది. తాజాగా సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో 105 ఘటనలు సీసీటీవీలో నమోదైనట్లు చెప్పడంతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశమైంది. సెప్టెంబర్ 25లోపు ఛార్జ్‌షీట్ దాఖలు కానుండటంతో ఇక ఈ కేసులో తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది కీలకంగా మారింది.
Also Read : బ్యాంకు ఖాతాదారులకు బిగ్ షాక్.. వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకంటే?









