AI ఇచ్చిన తప్పుడు సమాచారంతో అమెరికా, చైనా మధ్య పెద్ద సైనిక ఘర్షణ జరిగే పరిస్థితి వచ్చింది. ఈ ఏడాది ఇరాన్‌తో అమెరికా యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. మధ్యప్రాచ్యంలో వెళ్తున్న ఓ చైనా నౌకలో అణ్వాయుధ కార్యక్రమానికి సంబంధించిన పరికరాలు ఉన్నాయని అమెరికా సైన్యానికి ఓ నిఘా నివేదిక అందింది. దీంతో అమెరికా అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. నౌకను అడ్డుకుని తనిఖీ చేయాలని నిర్ణయించారు. నౌకలోకి వెళ్లేందుకు సాయుధ సైనికులను కూడా సిద్ధం చేశారు. ఆ సమయంలో అమెరికా సైనిక విమానాలు కూడా గాల్లో ఉన్నట్లు తెలిపింది.

Also Read : సౌజన్య కేసు మళ్లీ ఓపెన్.. 14 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు సంచలన ఆదేశం

అయితే ఆపరేషన్ మొదలయ్యే ముందు అధికారులు ఆ నిఘా నివేదికను మరోసారి పరిశీలించారు. అప్పుడే అసలు విషయం బయటపడింది. ఆ నివేదికను తయారు చేయడంలో ఓ సైనిక విశ్లేషకుడు ఏఐ చాట్‌బాట్‌ సాయం తీసుకున్నట్లు గుర్తించారు. నౌకలో ఉన్న సరుకును ఏఐ తప్పుగా గుర్తించింది. దాంతో అసలు లేని అణ్వాయుధ పరికరాలు నౌకలో ఉన్నాయని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ తప్పు బయటపడటంతో అమెరికా అధికారులు వెంటనే ఆపరేషన్‌ను నిలిపివేశారు. ఈ వ్యవహారం గురించి తెలిసిన ఓ వ్యక్తి.. ఆ నిఘా నివేదిక పూర్తిగా తప్పని, అది దాదాపు యుద్ధానికి దారితీసింది.

అమెరికా స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ పసిఫిక్‌కు సంబంధించిన ఓ విశ్లేషకుడు చైనా నౌకకు సంబంధించిన సమాచారాన్ని ఏఐ చాట్‌బాట్‌లో పరిశీలించాడు. ఆ ప్రక్రియలో ఏఐ అందుబాటులో ఉన్న బహిరంగ సమాచారం, ప్రభుత్వ వ్యవస్థల్లోని రహస్య నిఘా సమాచారాన్ని కలిపి తప్పు అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత ఆ సమాచారాన్ని సాధారణ నిఘా నివేదిక రూపంలో తయారు చేసి సైనిక అధికారులకు పంపించారు. అయితే ఆ చైనా నౌకలో నిజంగా ఏ సరుకు ఉంది, అది ఎక్కడికి వెళ్తోంది అనే వివరాలను అధికారులు బయటపెట్టలేదు. అలాగే ఈ ఘటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ నుంచి వెంటనే అధికారిక స్పందన రాలేదు.

అమెరికా సైన్యం నిఘా సమాచారాన్ని పరిశీలించడం, లక్ష్యాలను గుర్తించడం, సరఫరా వ్యవస్థలు, ఇతర పనుల్లో ఏఐ వినియోగాన్ని వేగంగా పెంచుతోంది. భారీ మొత్తంలో సమాచారాన్ని త్వరగా విశ్లేషించేందుకు ఏఐ ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ఘటనలో కనిపించినట్లుగా ఏఐ ఇచ్చిన తప్పు సమాచారాన్ని అధికారులు నమ్మితే చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి.

Also Read : రిటైర్డ్‌ క్రికెటర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్‌.. హెల్త్‌ బెన్‌ఫిట్స్‌ పెంపు

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.