
UPI : గాజియాబాద్‌లో కొందరు వ్యాపారులు తమ దుకాణాల ముందు పెట్టిన నోటీసులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. UPI పేమెంట్ తీసుకోం అంటూ షాపుల ముందు బోర్డులు పెడుతున్నారు. అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు పైగా జరిగే కొన్ని UPI చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ వసూలు చేయాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా వ్యాపారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ.2,000కు పైగా చేసే కొన్ని UPI చెల్లింపులపై 0.4 శాతం MDR వసూలు చేస్తారు. ఈ డబ్బును కస్టమర్ కాదు.. వ్యాపారే చెల్లించాలి. అయితే ఈ అదనపు భారం తమపై పడితే.. చివరికి కస్టమర్ల నుంచే వసూలు చేయాల్సి రావచ్చని వ్యాపారులు చెబుతున్నారు.
అందుకే అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు పైగా షాపింగ్ చేసేవారు నగదు తీసుకురావాలని కొందరు వ్యాపారులు సూచిస్తున్నారు. పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేసేవారి నుంచి UPI తీసుకోకుండా నగదు అడిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ప్రతి UPI పేమెంట్‌పై ఛార్జీ ఉండదు. రూ.2,000 వరకు చేసే వ్యక్తి నుంచి షాపుకు జరిగే UPI చెల్లింపులకు కొత్త MDR వర్తించదు. అంటే మీరు షాపులో రూ.1,500 విలువైన వస్తువు కొని UPI ద్వారా చెల్లిస్తే అదనంగా ఎలాంటి UPI ఛార్జీ ఉండదు.
రోజువారీగా మనం చేసే చాలా UPI పేమెంట్లు చిన్న మొత్తాల్లోనే ఉంటాయి. NPCI డేటా ప్రకారం ఆగస్టులో షాపులు, వ్యాపారులకు జరిగిన UPI చెల్లింపుల్లో 86 శాతం రూ.500లోపే ఉన్నాయి. మరో 10 శాతం రూ.501 నుంచి రూ.2,000 మధ్య ఉన్నాయి. అంటే కొత్త ఛార్జీ ప్రభావం ఎక్కువ మొత్తంలో జరిగే కొన్ని చెల్లింపులపైనే ఉంటుంది.
రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు 0.4 శాతం MDR ఉన్నా గరిష్ఠంగా రూ.300 మాత్రమే ఛార్జీగా ఉంటుంది. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే UPI పేమెంట్లపై మాత్రం ఈ ఛార్జీ ఉండదు. కస్టమర్ల నుంచి ఈ ఛార్జీని వసూలు చేయకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వ్యాపారులు బిల్లులో ప్రత్యేకంగా ‘UPI ఛార్జీ’ పేరుతో అదనపు డబ్బు తీసుకోకుండా ఉండేందుకు పేమెంట్ సంస్థలు, బ్యాంకులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.
కొత్త MDR వల్ల ప్రజలు మళ్లీ నగదు వైపు వెళ్లాల్సిన పరిస్థితి రాదని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం UPI లావాదేవీల్లో దాదాపు 4 శాతం మాత్రమే ఈ కొత్త ఛార్జీ పరిధిలోకి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక RuPay డెబిట్ కార్డు ద్వారా చేసే చెల్లింపులకు లావాదేవీ మొత్తం ఎంత ఉన్నా MDR ఉండదు. దీంతో పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేసే వారికి UPIకి బదులుగా మరో డిజిటల్ పేమెంట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.









