Onion Prices : ఇపుడు ఉల్లి ధర వింటేనే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. రెండు నెలల క్రితం వంద రూపాయలకు ఐదు కిలోల వరకు లభించిన ఉల్లిపాయల ధర ఒక్కసారిగా పెరిగింది. ట్రాలీ ఆటోల మీద రూ.100 కు ఐదు కిలోల చొప్పున లభించిన ఉల్లి ఉపుడు కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తోంది. అవే ట్రాలీ ఆటోల మీద ఇపుడు కిలో రూ.70 చొప్పన అమ్ముతున్నారు. పరిస్థితి చూస్తుంటే ఉల్లి ధర త్వరలోనే రూ.100కు చేరువయ్యే అవకాశం లేకపోలేదు.. నిజానికి ఉల్లి ధరల ఇంతలా పెరగడానికి కారణమేంటంటే?

ప్రతి ఇంటిలో అత్యవసరమైన ఉల్లిగడ్డ ధరలు గత కొంత కాలంగా భారీగా పెరుగుతున్నాయి. రిటైల్ మార్కెట్లో ఉల్లిపాయల ధర కిలో రూ.70కి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పంట దిగుబడి తగ్గడం, మార్కెట్లో సరఫరా తగ్గడంతో ఉల్లి ధరలు వేగంగా పెరుగుతూ సామాన్యున్ని భయపెడుతున్నాయి. జులై వరకు హైదరాబాద్‌లో రూ.100కు 4 లేదా 5 కిలోల వరకు లభించిన ఉల్లిగడ్డలు ఇప్పుడు కిలో రూ70 కి చేరుకోవడం గమనార్హం.. ఈ విషయాన్ని గమినిస్తే ఉల్లి ధరలు ఒక్రటెండు నెలల్లోనే ఎంతా పెరిగాయో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వం ఉల్లి ధరల భారం సామాన్యుడిపై పడకుండా ఉండేందుకు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసింది. సామాన్యుల కోసం రైతు బజార్లలో రూ.35 కిలో చొప్పున విక్రయిస్తోంది. కేంద్రం ధరల స్థిరీకరణ నిధి ద్వారా 1 లక్షా 21 వేల టన్నుల బఫర్ స్టాక్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. అయినా ఇవి అందరికీ చేరలేదు. మరోవైపు వ్యాపారులు కృతిమ కొరతను సృష్టించి పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉల్లి ధరలు భయాన్ని కలిగిస్తున్నాయి.

హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్లో క్వింటాల్ ఉల్లి రూ.5500 వరకు పలుకుతోందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌కు మహారాష్ట్ర నుంచి మాత్రమే ఉల్లి సరఫరా అవుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం రోజుకు 5-6 వేల క్వింటాళ్ల వరకు మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో మలక్‌పేట మార్కెట్‌కు గరిష్టంగా 8 వేల క్వింటాళ్ల వరకు ఉల్లిపాయలు వస్తుంటాయని వారు చెబుతున్నారు. సీజన్లో రోజుకు 12 వేల టన్నుల నుంచి 15 వేల టన్నుల ఉల్లిపాయలు వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం దిగుబడి లేకపోవడం ధరలు పెరగడంతో మార్కెట్‌కు అనుకున్నంత స్థాయిలో ఉల్లి గడ్డలు రావడం లేదు.కాగా, ఉల్లి దిగుబడి ఎక్కువగా వస్తే రైతుకు గిట్టుబాటు ధర అందడం లేదు. దిగుబడి తగ్గితే ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.

Also Read : కాంగ్రెస్‌ నేతలకు బిగ్‌షాక్‌.. మహేష్ గౌడ్, అద్దంకిలపై హరీశ్ రావు పరువునష్టం దావా

ఉల్లి ధర పెరగడానికి కారణాలేంటి?

నిజానికి ఉల్లి ధరలు పెరగడానికి పంట దిగుబడి తగ్గడంతోపాటు.. సరైన పంట నిల్వ సదుపాయాలు లేకపోవడమే కారణమని తెలుస్తోంది. కోల్ట్ స్టోరేజీ సదుపాయాలు లేకపోవడంతో తేమ కారణంగా నిల్వ చేసిన ఉల్లిపాయల్లో ఎక్కువ శాతం కుళ్లిపోతున్నాయని చెబుతున్నారు. దీని వల్ల పంట వృథా అవుతోందని,. రవాణా ఛార్జీలు పెరగడం, అక్రమ నిల్వలు పెరగడం, పాత పంట నిల్వలు అయిపోయి కొత్త పంట మార్కెట్‌కు రాకపోవడం, అంతర్జాతీయ డిమాండ్ లాంటి అంశాలు కూడా ఉల్లి ధరలు పెరగడానికి కారణం అవుతున్నాయని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. దీనిపై ప్రభుత్వాలు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

Also Read : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి… ఓటరు జాబితా షెడ్యూల్‌ విడుదల

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.