HARISH NOTICE TO PCC : చేతబడులు, క్షుద్ర పూజల పేరుతో తనపై తీవ్రమైన,నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ టీ PCC చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్‌, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు పరువు నష్టం దావా వేశారు.ఈ విషయమై గతంలోనే వారికి లీగల్ నోటీసులు జారీ చేసిన హరీశ్ రావు, వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అయితే వారు క్షమాపణ చెప్పకపోవడంతో హరీష్‌రావు ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు. గురువారం హైదరాబాద్‌ నాంపల్లి లోని ప్రజాప్రతినిధుల కోర్టులో కాంగ్రెస్ నేతలపై క్రిమినల్ పరువు నష్టం (Defamation) పిటిషన్ దాఖలు చేశారు. తన రాజకీయ ప్రతిష్టను, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ నేతలు అసత్య ఆరోపణలు చేశారని ఆరోపించిన హరీష్‌రావు వారిపై 356 BNS కింద కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తను కొల్లూరు మూకాంబికా దేవి ఆలయ దర్శనానికి వెళ్తే దాన్ని వక్రీకరించి తనపై క్షుద్ర పూజల ఆరోపణలు చేశారని హరీష్‌ రావు ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ నేతల అసత్య ప్రచారాల వీడియోలు.పేపర్ క్లిప్పింగ్స్ కోర్టుకు సమర్పించిన హరీశ్ రావు అడ్వకేట్లు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కాగా, ఈ సందర్భంగా తెలంగాణలో వర్షాలు పడకుండా అడ్డుకునేందుకు హరీశ్ రావు వేర్వేరు ప్రాంతాలు, ఆలయ సందర్శనలు చేసి క్షుద్ర పూజలు నిర్వహించారని అద్ధంకి దయాకర్, మహేష్‌కుమార్‌ అసత్య ప్రచారం చేశారని హరీష్‌ రావు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హరీశ్ రావు.. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేని విధంగా తన భక్తిభావాన్ని కూడా రాజకీయం చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గతంలో లీగల్ నోటీసులు పంపినప్పటికీ స్పందన రాకపోవడంతో, తాజాగా కోర్టును ఆశ్రయించినట్లు లాయర్లు తెలిపారు. కాగా, కాంగ్రెస్‌ వైఫల్యాలను నిలదీస్తే కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని.6 గ్యారెంటీల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే క్షుద్ర ఆరోపణలు చేస్తుందని హరీష్‌ రావు ఆరోపించారు.అడ్డగోలు ఆరోపణలు చేస్తే ఇక చూస్తూ ఊరుకునేది లేదు.చట్టం ద్వారానే వారికి బుద్ధి చెబుతామని హరీశ్ రావు వార్నింగ్‌ ఇచ్చారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.