Graduate MLC : తెలంగాణలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. త్వరలో ఖాళీ కాబోతున్న వరంగల్- ఖమ్మం–నల్గొండ, మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. దీనికి సంబంధించి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా షెడ్యూల్‌ విడుదల చేసింది. మహబూబ్‌నగర్‌,-రంగారెడ్డి-,హైదరాబాద్‌, వరంగల్‌-,ఖమ్మం,-నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేషన్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గాల నూతన ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి గురువారం విడుదల చేశారు.

ఈ రెండు నియోజకవర్గాల స్థానాల గడువు మార్చి 2027తో ముగియనుంది. దీంతో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొత్తగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. కాగా, 1 నవంబర్ 2026ను అర్హత తేదీగా పరిగణనలోకి తీసుకుని ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సురభి వాణి దేవీ, వరంగల్- ఖమ్మం–నల్గొండ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న తీన్మార్ మల్లన్న పదవీ కాలం వచ్చే మార్చితో ముగియనుండటంతో కొత్త జాబితా తయారు చేయడానికి ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది.

ఈ ప్రక్రియలో భాగంగా పట్టభద్రుల ఓట్ల నమోదు కోసం ఈ నెల 20న ఎన్నికల కమిషన్‌ పబ్లిక్‌ నోటీసు ఇవ్వనుంది. అనంతరం నవంబరు 6 వరకు ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబరు 25న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తారు. నవంబరు 25 నుంచి డిసెంబరు 10 వరకు అభ్యంతరాలు స్వీకరించనుంది. డిసెంబరు 30న పట్టభద్రుల తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు.

Also Read : జిన్‌పింగ్‌కు బ్రెయిన్‌స్ట్రోక్‌ ? కోమాలో చైనా అధ్యక్షుడు?

పాత ఓటర్లు కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందే :

గత గ్రాడ్యుయేట్‌ ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారు కూడా ఈసారి కొత్తగా నమూనా ఫారమ్-18 (Form-18) ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి అని ఈసీ తేల్చి చెప్పింది. పాత ఓటరు జాబితా ఆధారంగా నేరుగా పేరు నమోదు చేయబడదని స్పష్టం చేసింది. దరఖాస్తుతో పాటు అవసరమైన విద్యా అర్హత సర్టిఫికెట్ల ధ్రువీకరించిన కాపీలను జతచేయాలని సూచించింది. అర్హులైన పట్టభద్రులు CEO అధికారిక వెబ్‌సైట్ https://ceotelangana.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని తెలిపింది. లేదంటే నిర్ణీత ఫారమ్‌ను పూర్తి చేసి అవసరమైన పత్రాలతో ERO / AERO / డెసిగ్నేటెడ్ అధికారులకు నేరుగా కానీ, పోస్ట్ ద్వారా కానీ అందజేయవచ్చని సీఈఓ కార్యాలయం వివరించింది.

Also Read : వినాయక నిమజ్జనానికి హైకోర్టు షాక్‌… ట్యాంక్‌బండ్‌లో నో ఫర్మిషన్‌

ఓటరు జాబితా షెడ్యూల్ :

పబ్లిక్ నోటీసు విడుదల: 28 సెప్టెంబర్2026

ఫారమ్-18 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 6 నవంబర్ 2026

డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణ: 25 నవంబర్ 2026

అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ: 25 నవంబర్ 2026 నుండి 10 డిసెంబర్ 2026 వరకు

తుది ఓటర్ల జాబితా ప్రచురణ: 30 డిసెంబర్ 2026

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.