Bakrid Holiday Date Changed in Telangana & Andhra Pradesh
Bakrid Holiday Date Changed in Telangana & Andhra Pradesh

Bakrid Holiday : తెలుగు రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ఈ ఏడాది బక్రీద్ (ఈద్ అల్-అధా) పండుగ ప్రభుత్వ సెలవు దినం మారింది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం పవిత్రమైన దుల్-హిజ్జా నెలవంక దర్శనం ఒక రోజు ఆలస్యం కావడంతో, మత పెద్దల సూచనల మేరకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు తేదీని సవరిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశాయి. గతంలో ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం కాకుండా, మారిన చంద్రదర్శనం ఆధారంగా ఇరు రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయం ప్రకారం సెలవు దినం మారింది. గతంలో  ప్రభుత్వ సెలవుమే 27, 2026 (బుధవారం)న ప్రకటించగా దాన్ని మే 28, 2026 (గురువారం)సెలవు వర్తించేలా మార్పు చేసినట్లు అధికారులు వెల్లడించారు.ఈ సెలవు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, బ్యాంకులకు వర్తించనుంది.

చంద్రుని దర్శనం ఆధారంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వంటి గల్ఫ్ దేశాలలో మాత్రం మనకంటే ఒక రోజు ముందుగానే, అంటే మే 27న (బుధవారం) బక్రీద్ పండుగను జరుపుకోనున్నారు. ముస్లిం సోదరులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పవిత్ర పండుగ ఇస్లామిక్ క్యాలెండర్‌లోని చివరి నెల అయిన దుల్-హిజ్జా 10వ రోజున వస్తుంది. ముస్లిం పండుగలన్నీ పూర్తిగా చంద్రదర్శనంపైనే ఆధారపడి ఉంటాయి. తెలంగాణ వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మైనారిటీ సంక్షేమ శాఖల నుంచి వచ్చిన అధికారిక విజ్ఞప్తులు, సిఫార్సులను పరిశీలించిన ప్రభుత్వం ఈ మార్పును ఖరారు చేసింది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, 1881 (N.I. Act) ప్రకారం మే 28వ తేదీని సాధారణ సెలవు దినంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఇన్‌ఛార్జ్) కే. రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పు వల్ల రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలు, బ్యాంకులకు మే 28న అధికారిక సెలవు ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా చంద్రదర్శనం ఆలస్యం కావడంపై ముస్లిం మతపెద్దల నుంచి వచ్చిన సూచనల మేరకు రెండు రోజుల క్రితమే స్పందించింది. తెలంగాణ కంటే ముందే ఏపీ ప్రభుత్వం మే 28న (గురువారం) బక్రీద్ సాధారణ సెలవుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మే 28, 2026 (గురువారం) నాడే అధికారికంగా బక్రీద్ పండుగను జరుపుకోనున్నారు, అలాగే ఆ రోజే సాధారణ సెలవు దినం ఉండనుంది.