Cheyuta Pension : తెలంగాణ ప్రభుత్వం నూతనంగా చేయూత పథకం కోసం దరఖాస్తు చేసుకునే వారికి గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ రోజు ముగియనున్న నూతన పింఛన్ల (చేయూత పెన్షన్లు) దరఖాస్తుల స్వీకరణ గడువును మరో రోజు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో లబ్ధిదారులు రేపు సాయంత్రం 5:00 గంటల వరకు తమ దరఖాస్తులను సమర్పించుకునే వెసులుబాటు కలిగింది. గత షెడ్యూల్ ప్రకారం చేయూత నూతన పింఛన్ల దరఖాస్తు గడువు నేటితో ముగియాల్సి ఉంది. అయితే, వరుసగా మూడు రోజుల పాటు ప్రభుత్వ సెలవులు రావడంతో అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం దక్కలేదు. దీంతో ప్రభుత్వం దరఖాస్తు రోజును మరోరోజు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ కార్యాలయాలు, మీ-సేవ (Me seva) కేంద్రాలకు వరుసగా 3 రోజులు(శనివారం, ఆదివారం, సోమవారం ) సెలవులు రావడం వల్ల దరఖాస్తు చేసుకోవడానికి ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ప్రజల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ వెసలుబాటు కల్పించింది.

Also Read : వినాయక నిమజ్జనానికి హైకోర్టు షాక్‌… ట్యాంక్‌బండ్‌లో నో ఫర్మిషన్‌

అయితే, సాధారణంగా ప్రభుత్వం నిర్ధేశించిన నిర్ణీత గడువు ముగింపు దశకు చేరుకున్న సమయంలో వరుస సెలవులు రావడం వల్ల సర్వర్ల మీద భారం పడటం, దరఖాస్తుదారులు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ అదనపు సమయాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల కంప్యూటర్లు మొరాయించడం మూలంగా సకాలంలో దరఖాస్తులు అందజేయలేకపోయామని పలువురు విజ్ఞప్తి చేయడంతో, లబ్ధిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గడువును మరో రోజు పొడిగిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సీఈవో దివ్య దేవరాజన్ అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అర్హత ఉండి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Also Read : నానక్‌రామ్‌గూడ లో భూకబ్జా యత్నం.. బన్నీ మామపై కేసు నమోదు

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.