
UPI ద్వారా చేసే కొన్ని చెల్లింపులపై ఇకపై ఛార్జీలు పడనున్నాయి. అయితే ఈ ఛార్జీలు అందరికీ వర్తించవు. రూ.2,000 కంటే ఎక్కువ మొత్తాన్ని వ్యాపార సంస్థలకు చెల్లించే కొన్ని లావాదేవీలపై మాత్రమే ఛార్జీలు విధించనున్నారు. వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ చెల్లింపులు మాత్రం ఎప్పటిలాగే ఉచితంగానే ఉంటాయి. ఇండియాలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని ప్రకటించింది.
కొత్త నిబంధనల ప్రకారం.. రూ.2,000 కంటే ఎక్కువ మొత్తాన్ని ఏదైనా వ్యాపార సంస్థకు యూపీఐ ద్వారా చెల్లిస్తే.. ఆ వ్యాపార సంస్థపై 0.4 శాతం వరకు ఛార్జీ పడుతుంది. అయితే ఈ ఛార్జీ గరిష్ఠంగా రూ.300కు మించదు. మీరు యూపీఐ ద్వారా స్నేహితుడికి, కుటుంబ సభ్యుడికి లేదా మరొక వ్యక్తికి డబ్బులు పంపితే.. దానికి ఎలాంటి ఛార్జీ ఉండదు. లావాదేవీ మొత్తం ఎంత పెద్దదైనా వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే చెల్లింపులు ఉచితంగానే కొనసాగుతాయి. ఉదాహరణకు.. మీరు మీ స్నేహితుడికి రూ.5,000 యూపీఐ ద్వారా పంపారనుకుందాం. ఈ లావాదేవీపై ఎలాంటి ఛార్జీ ఉండదు. అదే రూ.5,000ను ఒక వ్యాపార సంస్థకు చెల్లిస్తే.. అది వర్తించే వ్యాపార వర్గం, నిబంధనల ఆధారంగా ఛార్జీ విధించే అవకాశం ఉంటుంది.
రైల్వే టికెట్లు, టెలికాం సేవలు, బీమా, ఇంధనం వంటి కొన్ని ప్రత్యేక వ్యాపార వర్గాలకు సంబంధించిన యూపీఐ చెల్లింపులపై రూ.2,000 కంటే ఎక్కువ మొత్తానికి రూ.5 స్థిర ఛార్జీ విధించనున్నట్లు NPCI తెలిపింది. అంటే.. ఈ ప్రత్యేక వర్గాల్లోని వ్యాపార సంస్థలకు రూ.2,000 కంటే ఎక్కువ మొత్తాన్ని యూపీఐ ద్వారా చెల్లిస్తే.. వర్తించే నిబంధనల ప్రకారం రూ.5 ఛార్జీ పడుతుంది. ఈ ఛార్జీలు సాధారణంగా చెల్లింపులు చేసే వ్యక్తులపై కాకుండా.. వ్యాపార సంస్థలపై విధించే రుసుములుగా ఉంటాయి. కాబట్టి యూపీఐ ద్వారా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు డబ్బులు పంపే వినియోగదారులు ఎలాంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యాపార చెల్లింపులపై కూడా ఛార్జీ వర్తిస్తుందా లేదా అనేది సంబంధిత వ్యాపార వర్గం, లావాదేవీ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.









