
TG Jobs: వైద్య విభాగంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో వివిధ ఆరోగ్య కార్యక్రమాలు, ఆరోగ్య కేంద్రాల్లో పనిచేయడానికి అవసరమైన ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధిపేట జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లా పరిధిలోని ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 110 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ కే. హైమావతి వెల్లడించారు. సంబంధిత ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
ఏ విభాగాల్లో ఎన్ని ఉద్యోగాలు?
ఈ పోస్టులను సిద్దిపేట జిల్లాలోని పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, పాలియేటివ్ కేర్, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (NUHM), మొబైల్ హెల్త్ టీమ్స్, అసంక్రమిక వ్యాధుల నియంత్రణ కార్యక్రమం (NCD), RBSK జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (DEIC), తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్ తదితర విభాగాల్లో భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
మొత్తం ఖాళీలు: 110, పోస్టుల వివరాలు
ల్యాబ్ టెక్నీషియన్: 4
స్టాఫ్ నర్స్: 40
ANM: 11
ఫార్మసిస్ట్: 10
MLHP / CHO / MO – పల్లె దవాఖాన: 37
ఫిజిషియన్ (MD/MBBS): 2
ఫిజియోథెరపిస్ట్ / ఆక్యుపేషనల్ థెరపిస్ట్: 1
ఆడియాలజిస్ట్ / స్పీచ్ థెరపిస్ట్: 1
ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్: 1
డెంటల్ మెడికల్ ఆఫీసర్: 1
ఆప్టోమెట్రిస్ట్: 1
సైకాలజిస్ట్: 1
కాగా, పై పోస్టులకు అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు పూర్తిచేసిన దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులను సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం (IDOC), దుద్దెడలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, సిద్దిపేటలో అందజేయాలని కలెక్టర్ తెలిపారు.
పూర్తి వివరాలు వెబ్సైట్లో..
కాగా, ఆయా పోస్టులకు సంబంధించి విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం సిద్దిపేట జిల్లా అధికారిక వెబ్సైట్లోని Recruitment విభాగంలో పరిశీలించాలని జిల్లా కలెక్టర్ కే. హైమావతి సూచించారు.









