JDU on UCC: దేశమంతటా ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయాలని భావిస్తున్న భారతీయజనతాపార్టీ ప్రయత్నానికి బీహార్‌లో నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. బీహార్‌లో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుకు తాము వ్యతిరేకమని ఆ పార్టీ మిత్రపక్షమైన జేడీయూ స్పష్టం చేసింది. పార్లమెంట్‌లో యూసీసీ బిల్లుకు తాము మద్దతు తెలిపినప్పటికీ.. రాష్ట్రంలో అమలుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆ పార్టీ సీనియర్‌ నేత శ్యామ్‌ రజక్‌ తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేత నీతీశ్‌ కుమార్‌ ఇప్పటికే స్పష్టంచేశారని ఆయన గుర్తు చేశారు. 2029 నాటికి దేశంలోని 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో యూసీసీ అమల్లోకి తీసుకు వస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై శ్యామ్‌ రజక్‌ పై విధంగా స్పందించడం గమనార్హం.

అయితే ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ బీహార్‌లో ప్రస్తుతం సామ్రాట్‌ చౌధరి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఎన్డీయేలో నీతీశ్‌ కుమార్‌ భాగస్వామిగా ఉన్నారు కదా ప్రశ్నించారు. దానికి శ్యామ్‌ రజక్‌ అంతే ధీటుగా బదులిచ్చారు. ముఖ్యమంత్రి బీజేపీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ.. ప్రభుత్వం మిత్రపక్షాల మద్దతుతో నడుస్తోందని ఆయన గుర్తుచేశారు. యూసీసీ విషయంలో తమ వైఖరి సుస్పష్టం అని, కాబట్టి అమలు ప్రస్తావనే ఉత్పన్నం కాదని ఆయన నొక్కి చెప్పారు. కాగా, ఈ పరిణామం బీహార్ ఎన్డీయే కూటమిలో భిన్న స్వరాలను ప్రతిబింబిస్తోంది.

ఇదిలా ఉండగా, ఉమ్మడి పౌరస్మృతి అమలు అంశంపై బీహార్‌లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన ఆర్జేడీ బీజేపీపై విరుచుకుపడింది. మరోసారి ఆ పార్టీ విద్వేష రాజకీయాలకు తెరతీసిందని విమర్శించింది. ‘‘బీజేపీకి ఇటీవల అనేక ఎదురుదెబ్బలు తగిలాయి. అందుకే తన పాత ఎత్తుగడ మొదలుపెట్టింది. విద్వేష రాజకీయాలను తిరిగి తీసుకొస్తుంది’’ అని పార్టీ అధికార ప్రతినిధి శక్తి యాదవ్ ఆరోపించారు. బిహార్‌ ప్రజల నరనరాల్లో లౌకికవాదం ఉంటుందనే విషయాన్ని బీజేపీ గుర్తుపెట్టుకోవాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో యూసీసీ అమలుకు ప్రయత్నిస్తే తాము అడ్డుకుని తీరుతామని తేల్చి చెప్పారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.