
Operation Sindoor :పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. భారతదేశం చేపట్టిన ఈ దాడిలో పీవోకేలోని పలు ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. అయితే ధ్వంసమైన ఆ స్థావరాలను పాకిస్థాన్ మళ్లీ పునర్నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని కొన్ని ఉగ్రస్థావరాలను ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఆ ఉగ్ర మౌలిక వసతులు తిరిగి నిర్మాణ దశలో ఉన్నట్లు తాజా విజువల్స్ స్పష్టం చేస్తున్నాయి. దీంతో సరిహద్దు అవతల ఉగ్ర మౌలిక వసతులను పునరుద్ధరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయనే విషయం తేటతెల్లమవుతోంది. దీన్ని బట్టి పాకిస్థాన్ తన ఉగ్రవాదాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. అంతేకాదు ఈ నిర్మాణాలకు పాకిస్థాన్ ఆర్థికసాయం అందిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ 2025 మేలో ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దాడిలో పాకిస్థాన్ తో పాటు పీవోకేలోని ఉగ్రవాద సంస్థలకు చెందిన పలు స్థావరాలను భారత సాయుధ దళాలు లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో లష్కరే తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌కు సంబంధించిన ఉగ్ర మౌలిక వసతులు ద్వంసమయ్యాయి. ఆ దాడుల్లో మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే పీవోకేలో గతంలో దెబ్బతిన్న కొన్ని ఉగ్ర స్థావరాలను తిరిగి నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న, విడివిడిగా ఉండే క్యాంపులను ఉగ్రవాదులు ఏర్పాటు చేస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం కూడా పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయ. అయితే భారత నిఘా వ్యవస్థలు, ఉపగ్రహాలు, డ్రోన్లు ఈ నిర్మాణాల ఉనికి గుర్తించకుండా ఉండేందుకు దట్టమైన అటవీ ప్రాంతాలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.
గతంలో ఉన్న పెద్ద స్థావరాల స్థానంలో చిన్న, విడివిడిగా ఉన్న ఉగ్ర స్థావరాలను ఏర్పాటు చేసే వ్యూహాన్ని పాకిస్థాన్ అనుసరిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. లూని, పుట్వాల్, తైపు పోస్ట్, జమీలా పోస్ట్, ఉమ్రాన్‌వాలి, చప్రార్, ఫార్వర్డ్ కహుటా, చిన్నా చక్, జంగ్లోరా వంటి ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్నట్లు భారత నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. కొత్త క్యాంపుల్లో థర్మల్ సెన్సర్లు, యాంటీ-డ్రోన్ వ్యవస్థలు వంటి సాంకేతిక పరికరాలను కూడా ఉపయోగిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.









